Medipally: మేడిపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ భారీ ధర్నా
Medipally: మేడిపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ ధర్నా. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేసిన నాయకులు.
Medipally: మేడిపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ భారీ ధర్నా
Medipally: పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక అండగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మేడిపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసనల్లో భాగంగా బోడుప్పల్ సర్కిల్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈ ఆందోళన చేపట్టారు. మాజీ జడ్పీటీసీ మంద సంజీవరెడ్డి, మాజీ మేయర్లు జక్క వెంకట్‌రెడ్డి, సామల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మంద సంజీవరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై కోర్టులో కేసు వేయించి, హైకోర్టు తీర్పును సాకుగా చూపుతూ పేదింటి ఆడబిడ్డలకు అండగా ఉన్న పథకాలను ఎత్తివేయాలని చూస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు.
మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి.. పేద మహిళలకు అండగా ఉన్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. వ్యక్తిగత కేసుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసే ప్రభుత్వ పెద్దలు.. పేద మహిళలకు సంబంధించిన ఈ పథకాల విషయంలో హైకోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించేందుకు న్యాయవాదులను ఏర్పాటు చేయకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో విఫలమైందని నాయకులు విమర్శించారు. పేదల సంక్షేమానికి ఉపయోగపడే పథకాలను నిర్వీర్యం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే న్యాయవాదులను ఏర్పాటు చేసి కోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించాలని, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ప్రజలు గమనిస్తున్నారని, ప్రజా వ్యతిరేక విధానాలకు తగిన సమాధానం చెప్పే రోజులు వస్తాయని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రఘువర్దన్‌రెడ్డి, లేతకుల రఘుపతిరెడ్డి, కొత్త రవిగౌడ్, నిర్మల, శ్రీధర్‌గౌడ్, కొత్త చక్రపాణిగౌడ్, మీసాల కృష్ణ, కౌడె పోచయ్య, రాజిరెడ్డి, పైల్ల ప్రభాకర్‌రెడ్డి, మహేష్, మహిళా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




