Parigi: పరిగిలో బీఆర్ఎస్ నిరసన కల్యాణ లక్ష్మి పథకం ఎత్తివేతపై మండిపాటు!
Parigi: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని పరిగిలో మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ నిరసన.
Parigi: పరిగిలో బీఆర్ఎస్ నిరసన కల్యాణ లక్ష్మి పథకం ఎత్తివేతపై మండిపాటు!
Parigi: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పరిగి పట్టణంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసాగా నిలిచిన ఈ పథకాలను కొనసాగించాలని నాయకులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మాట్లాడుతూ... పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక భరోసాకు ప్రతీకగా నిలిచిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు.
హైకోర్టు తీర్పును సాకుగా చూపుతూ లక్షలాది పేద కుటుంబాలకు అండగా నిలిచిన పథకాలను ఎత్తివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాదని.. తెలంగాణ పేద కుటుంబాల ఆడబిడ్డల భవిష్యత్తు, ఆత్మగౌరవంతో ముడిపడిన కార్యక్రమాలని అన్నారు.
రూ.51 వేల ఆర్థిక సహాయంతో ప్రారంభమైన ఈ పథకాన్ని దశలవారీగా రూ.75,116కు, అనంతరం రూ.1,00,116కు పెంచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని తెలిపారు.
కేసీఆర్ హయాంలో సుమారు 13 లక్షల మంది ఆడబిడ్డల కుటుంబాలకు రూ.13 వేల కోట్ల మేర ఆర్థిక సహాయం అందించామని పేర్కొన్నారు.కోవిడ్ వంటి తీవ్రమైన ఆర్థిక సంక్షోభ సమయంలోనూ కేసీఆర్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి ద్వారా పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచిందని గుర్తుచేశారు.
ఎన్నికల సమయంలో కల్యాణ లక్ష్మితో పాటు ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాన్ని బలోపేతం చేయాల్సింది పోయి రద్దు చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కల్యాణ లక్ష్మి లబ్ధిదారుల పరిస్థితి దారుణంగా మారిందని అన్నారు.
పెళ్లిళ్లు జరిగి చాలా కాలం గడిచినా, కొందరికి పిల్లలు పుట్టినా కూడా తమకు రావాల్సిన ఆర్థిక సహాయం కోసం లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు.ఈ నిరసన కార్యక్రమంలో అన్ని మండలాల బీఆర్ఎస్ నాయకులు, సర్పంచులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.




