Ghatkesar: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఫైర్!

Ghatkesar: రాష్ట్ర కవి అందెశ్రీ స్మృతివనం భూమిపూజలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన రాజకీయ వ్యాఖ్యలపై ఘట్‌కేసర్‌లో బీఆర్ఎస్ నేత రాగిడి లక్ష్మారెడ్డి తీవ్ర ఆగ్రహం.

KARUNAKAR, UPPAL
Published on: 19 July 2026 2:02 PM IST
Ghatkesar
X

Ghatkesar: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఫైర్!

Ghatkesar: రాష్ట్ర కవి అందెశ్రీ స్మృతివనం భూమిపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు ఘట్‌కేసర్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఘట్‌కేసర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జి రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ జడ్పీటీసీ మంద సంజీవరెడ్డి, మాజీ మేయర్లు జక్కా వెంకట్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. అందెశ్రీ వంటి మహనీయుడి పేరుతో నిర్వహించిన సాహిత్య కార్యక్రమాన్ని రాజకీయ విమర్శల వేదికగా మార్చడం బాధాకరమన్నారు. అందెశ్రీ సాహిత్య ప్రస్థానం, తెలంగాణ భాషా సంస్కృతికి ఆయన చేసిన సేవలు, కవుల పాత్ర గురించి, స్మృతి వనం పనులు ఎంత గడువులో పూర్తి చేస్తారనే విషయంపై మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ నాయకత్వంపై విమర్శలు చేయడం సముచితం కాదని అన్నారు. కార్యక్రమానికి హాజరైన పలువురు కవులు కూడా ఈ వ్యాఖ్యలతో అసంతృప్తికి గురై సభ నుంచి వెళ్లిపోయారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి హుందాతనం, సంయమనం పాటించాలని, వ్యక్తిగత విమర్శలు, దూకుడు వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి మంచివి కావని అన్నారు.

ప్రజలను విభజించే రాజకీయాల కంటే, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎన్నికల హామీలు నెరవేరలేదని ఆరోపించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, నిరుద్యోగ భృతి, సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు, యువ వికాసం పథకం, వికలాంగుల పెన్షన్ పెంపు, ఆరు గ్యారంటీల అమలు వంటి హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ప్రజలు వీటి గురించి ప్రశ్నిస్తే సమాధానాలు ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకులు తప్పించుకుంటున్నారని అన్నారు.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ అభివృద్ధి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దారని, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులతో సాగునీరు, తాగునీటి రంగంలో కీలక మార్పులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. అలాంటి నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం రాజకీయ సంస్కృతికి విరుద్ధమన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని ఘట్ కేసర్ లో రైతు రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదని, జవహర్‌నగర్ డంపింగ్ యార్డు కాలుష్య సమస్యకు పరిష్కారం చూపడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

ఘట్‌కేసర్ రైల్వే ఓవర్‌బ్రిడ్జి పనులు బీఆర్ఎస్ హయాంలో దాదాపు పూర్తయ్యాయని, మిగిలిన పనులు పూర్తి చేయాలని కోరిన వారిపై చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడంలో కాకుండా, ప్రజా సమస్యల పరిష్కారం, ఎన్నికల హామీల అమలుపై దృష్టి సారించాలని రాగిడి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలంతా ప్రభుత్వ పనితీరును నిశితంగా గమనిస్తున్నారని, అహంకారపూరిత ధోరణి ప్రజాక్షేత్రంలో నిలవదని హెచ్చరించారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story