LB Nagar: ధరల పెరుగుదలపై కాంగ్రెస్ సర్కార్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ మహిళల నిరసన!

LB Nagar: నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నిరసిస్తూ ఎల్బీనగర్ ఎన్టీఆర్ మార్కెట్ నుంచి చౌరస్తా వరకు బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన నిర్వహించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 3 Nov 2026 2:03 PM IST
LB Nagar
X

LB Nagar: ధరల పెరుగుదలపై కాంగ్రెస్ సర్కార్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ మహిళల నిరసన!

LB Nagar: నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలపై మోయలేని ఆర్థిక భారం పడుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఎల్బీనగర్‌లో బీఆర్ఎస్ మహిళా విభాగం మౌన ప్రదర్శన నిర్వహించింది. ఎన్టీఆర్ మార్కెట్ నుంచి ఎల్బీనగర్ చౌరస్తా వరకు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ మహిళా నాయకులు 2023లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని నిత్యావసర వస్తువుల ధరలను, 2026లో రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలోని ధరలతో పోలుస్తూ రూపొందించిన పట్టికను ప్రదర్శించారు. బియ్యం, వంట నూనె, గ్యాస్ సిలిండర్, పాలు, చక్కెర, కందిపప్పు, గుడ్లు, ఉల్లిపాయలు, టమోటాల ధరల పెరుగుదలను ప్రజల దృష్టికి తీసుకెళ్లారు.

రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడుతోందని మహిళా విభాగం ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా కుటుంబ ఆర్థిక వ్యవహారాలను నిర్వహించే మహిళలు ధరల భారంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది.

ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది.

ప్రజలకు కావాల్సింది కేవలం హామీలు కాదు.. పెరుగుతున్న ధరల నుంచి ఉపశమనం! అని బీఆర్ఎస్ మహిళా విభాగం స్పష్టం చేసింది.

ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ మహిళా నాయకులు, బీఆర్ఎస్ మహిళా విభాగం ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR