Hyderabad: ఉస్మానియా విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి!

Hyderabad: ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ డిమాండ్ చేశారు.

HARISH, TARNAKA
Published on: 21 Nov 2026 8:19 AM IST
Hyderabad
X

Hyderabad: ఉస్మానియా విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి!

Hyderabad: ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ సొంటె ఆధ్వర్యంలో బీఎస్పీ రాష్ట్ర ప్రతినిధుల బృందం, ఓయూ విద్యార్థి నాయకులతో కలిసి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌కు వినతిపత్రం అందజేసింది.

ఈ సందర్భంగా హాస్టళ్లలో నాసిరకమైన, అపరిశుభ్రమైన ఆహారం, పారిశుద్ధ్య లోపాలు, సురక్షిత తాగునీటి కొరత, అధిక మెస్ బిల్లులు, మౌలిక సదుపాయాల లేమి, వైద్య సదుపాయాల కొరత వంటి సమస్యలను వీసీ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.1,000 కోట్ల నిధుల విడుదల, వినియోగం, అభివృద్ధి పనుల పురోగతిపై స్పష్టత ఇవ్వాలని, పెండింగ్ పనులను వేగవంతం చేయాలని కోరారు.

అన్ని హాస్టళ్లలో తక్షణ తనిఖీలు నిర్వహించి, ఏడు రోజుల్లో పరిష్కరించగల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, మిగిలిన సమస్యలకు కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రకటించాలని, విద్యార్థి ప్రతినిధులతో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం, పరిశుభ్రమైన వసతి, ఆరోగ్యకరమైన విద్యా వాతావరణం కల్పించడం వారి హక్కు అని, సమస్యలు పరిష్కారమయ్యే వరకు బీఎస్పీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీరాం కృష్ణ, ప్రధాన కార్యదర్శులు గుండెల ధర్మేందర్, బానోత్ రవీందర్ నాయక్, మేడి సతీష్, రాష్ట్ర కోశాధికారి ప్రణయ్ కుమార్, నాయకులు బరుగు జ్ఞానేశ్వర్, దోసల కుమార్, అలగొల రమేష్, విజయరాజ్, ఓయూ విద్యార్థి నాయకులు జంగిలి దర్శన్, డాక్టర్ కత్తి వీరన్న, రామకృష్ణ, రామ్, కాసర్ల మధు, ప్రవీణ్, స్వామి, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA