Hyderabad: డాడీ లేని జీవితం ఊహించుకోలేను.. తండ్రి మరణాన్ని తట్టుకోలేక బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య!
Hyderabad: తండ్రి మరణాన్ని తట్టుకోలేక హైదరాబాద్ మైసమ్మగూడలో బీటెక్ విద్యార్థిని జ్ఞానశ్రీ ఆత్మహత్య. డాడీ దగ్గరికే వెళ్తున్నానంటూ సూసైడ్ నోట్.
Hyderabad: డాడీ లేని జీవితం ఊహించుకోలేను.. తండ్రి మరణాన్ని తట్టుకోలేక బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య!
Hyderabad: కన్నతండ్రి మరణం ఆ కూతురిని తీరని వేదనకు గురిచేసింది. తండ్రి లేని లోకంలో తాను ఉండలేనంటూ ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని తనువు చాలించింది. హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు మరియు స్థానికుల కథనం ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా చాట్రాయికి చెందిన చెన్నకేశవులు కుమార్తె జ్ఞానశ్రీ (21) మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. మైసమ్మగూడలోని ఓ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటూ చదువు సాగిస్తోంది.
గత నెల మార్చి 31వ తేదీన జ్ఞానశ్రీ తండ్రి చెన్నకేశులు అనారోగ్యంతో మృతిచెందారు. ఆ సమయంలో సొంతూరుకు వెళ్లిన జ్ఞానశ్రీ, అంత్యక్రియలు పూర్తి చేసుకుని రెండు రోజుల క్రితమే తిరిగి హాస్టల్‌కు వచ్చింది. తండ్రి మరణం నుంచి ఆమె కోలుకోలేకపోయింది. బుధవారం కాలేజీలో పరీక్ష రాసిన ఆమె, గురువారం మాత్రం పరీక్షకు వెళ్లకుండా హాస్టల్‌లోనే ఉండిపోయింది.
మధ్యాహ్నం 3 గంటల సమయంలో జ్ఞానశ్రీ తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతదేహం వద్ద పోలీసులకు ఒక సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులోని వాక్యాలు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తున్నాయి.."మమ్మీ.. డాడీ లేని జీవితాన్ని నేను ఊహించుకోలేకపోతున్నా. తమ్ముడిని, నిన్ను తాతయ్య దగ్గర ఉండమని కోరుతున్నా. నేను డాడీ దగ్గరికే వెళ్లిపోతున్నా.." అని ఆమె తన ఆవేదనను లేఖలో రాసింది.
సమాచారం అందుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఉన్నత చదువులు చదివి ప్రయోజకురాలు అవుతుందనుకున్న కూతురు ఇలా విగతజీవిగా మారడంతో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది.




