Ghatkesar: ఏదులాబాద్‌లో బ్యాంకు చోరీకి దుండగుల విఫలయత్నం!
Ghatkesar: ఘట్‌కేసర్ పరిధిలోని ఏదులాబాద్ సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో కిటికీ పగులగొట్టి వెనుక గోడకు రంధ్రం చేసి చోరీకి యత్నించారు.
Ghatkesar: ఏదులాబాద్‌లో బ్యాంకు చోరీకి దుండగుల విఫలయత్నం!
ఘట్‌కేసర్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధి ఏదులాబాద్‌లోని సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. బుధవారం ఉదయం బ్యాంక్ తెరిచిన సిబ్బంది కిటికీ పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. స్ట్రాంగ్‌రూమ్ సమీపంలోని వెనుక గోడకు కూడా రంధ్రం చేసినట్లు గుర్తించారు. దుండగులు బ్యాంకులోకి చొరబడేందుకు ప్రయత్నించినప్పటికీ.. స్ట్రాంగ్‌రూమ్‌లోకి మాత్రం ప్రవేశించలేకపోయారు. దీంతో నగదు, విలువైన వస్తువులు, కీలక పత్రాలు ఏవీ చోరీ కాలేదు.
ఈ ఘటనపై బ్యాంక్ మేనేజర్ రంజిత్ ఘట్‌కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం అధికారులు ఆధారాలను సేకరించారు. బ్యాంకు పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
మేడిపల్లి ప్రాంతంలో రెండు రోజుల క్రితం జరిగిన భారీ చోరీ ఘటన నేపథ్యంలో.. ఏదులాబాద్ బ్యాంకులో జరిగిన చోరీ యత్నానికి ఆ ఘటనకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రెండు ఘటనల్లోనూ దుండగుల పని తీరు, ఉపయోగించిన పద్ధతులు, ఇతర ఆధారాలను పోలీసులు పోల్చి చూస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీలు, క్లూస్ టీం సేకరించిన ఆధారాల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




