Cherlapally: కార్మిక హక్కుల పరిరక్షణకు సంఘటిత పోరాటాలే మార్గం
Cherlapally: చర్లపల్లి బీపీసీఎల్‌లో సీఐటీయూ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జెండా ఆవిష్కరణ. రూ.42 వేల కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని అశోక్ డిమాండ్.
Cherlapally: కార్మిక హక్కుల పరిరక్షణకు సంఘటిత పోరాటాలే మార్గం
చర్లపల్లి: కార్మిక హక్కుల పరిరక్షణకు సంఘటిత పోరాటాలే మార్గమని సీఐటీయూ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ తెలిపారు. చర్లపల్లి పారిశ్రామికవాడలోని బీపీసీఎల్ పరిశ్రమలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు నూతనంగా ఏర్పాటు చేసుకున్న బీపీసీఎల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జెండాను ఆయన ఆవిష్కరించారు.
అనంతరం యూనియన్ అధ్యక్షుడు, సీఐటీయూ జిల్లా కోశాధికారి పి.గణేష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న సీఐటీయూ ఆధ్వర్యంలో యూనియన్ ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. పరిశ్రమల్లో యాజమాన్యాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు, కార్మికులంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు నెలకు రూ.42 వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. శాశ్వత ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు, ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
ప్రతి కార్మికుడికి ఈఎస్‌ఐ, పీఎఫ్, ప్రమాద బీమా, ప్రసూతి సెలవులు అమలు చేయాలని, నెలవారీ వేతనాలను ప్రతినెలా ఒకటో తేదీన బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తూ కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకించాలన్నారు. . కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని కోరారు. కార్మికుల శ్రమ లేకుండా పరిశ్రమల్లో ఉత్పత్తి, అభివృద్ధి సాధ్యం కాదని యాజమాన్యాలు గుర్తించాలన్నారు.
సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి జి.శ్రీనివాసులు మాట్లాడుతూ.. కార్మికులు తమ హక్కుల సాధనకు సంఘటితంగా ఉండాలని, యాజమాన్యాల కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. చర్లపల్లి ఇండస్ట్రియల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు బివి.సత్యనారాయణ మాట్లాడుతూ.. కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలు అవసరమన్నారు.
కార్మికులకు న్యాయంగా దక్కాల్సిన వేతనాలు, హక్కులు, సౌకర్యాలు కల్పించడంలో యాజమాన్యాలు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీ రాక్ పరిశ్రమ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎస్.మణికంఠ, గండూరి ఫుడ్స్ ప్రతినిధి రవీందర్‌రెడ్డి, బీపీసీఎల్ లారీ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు అశోక్‌గౌడ్, ఖాజా, హార్డ్‌కేస్ ఇంజినీరింగ్ ప్రతినిధి రమేష్, బీపీసీఎల్ కాంట్రాక్టు యూనియన్ నాయకులు శంకర్, రమేష్, నరేందర్, దినేష్, రాజు, శ్రీరామ్, బాలు, కిరణ్, కార్మికులు, లారీ యజమానులు పాల్గొన్నారు.




