Quthbullapur: పారిశ్రామిక కార్మికులకు కనీస వేతనాలు, ఈఎస్ఐ అమలు చేయాలి!

Quthbullapur: మేడ్చల్ జిల్లా ప్రగతి నగర్ లో సీఐటీయూ నేత ఎ. అశోక్ ఆధ్వర్యంలో కార్మికుల కనీస వేతనాలు, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలకై మీడియా సమావేశం నిర్వహించారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 13 July 2026 11:31 PM IST
Quthbullapur
X

Quthbullapur: పారిశ్రామిక కార్మికులకు కనీస వేతనాలు, ఈఎస్ఐ అమలు చేయాలి!

కుత్బుల్లాపూర్: సిఐటియు మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రగతి నగర్‌లోని సుందరయ్య భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. అశోక్ మాట్లాడుతూ, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని అన్ని పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కార్మికులకు చట్టబద్ధంగా కల్పించాల్సిన ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్, సెలవులు, భద్రతా పరికరాలు తదితర అన్ని సౌకర్యాలను ప్రతి యాజమాన్యం తప్పనిసరిగా అమలు చేయాలని కోరారు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు లేకుండా పనిచేస్తున్న కార్మికులను వెంటనే ఆయా పథకాల పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.

కార్మికులు కనీస వేతనాలు, చట్టబద్ధమైన హక్కుల కోసం ప్రశ్నించినప్పుడు యాజమాన్యాలు కార్మిక సంఘాల నాయకులను, కార్మికులను బెదిరించడం, వేధించడం, ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించడం వంటి చర్యలను ప్రభుత్వం వెంటనే అరికట్టాలని అన్నారు. కార్మికులకు రాజ్యాంగం కల్పించిన సంఘటిత హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం. 6ను జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పారిశ్రామిక ప్రాంతాల్లో ఎలాంటి మినహాయింపులు లేకుండా కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న యాజమాన్యాలపై కార్మిక శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ మీడియా సమావేశంలో సిఐటియు సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్ వెంకట రామయ్య, సిఐటియు మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు వెంకట్రాజ్యం, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి లింగస్వామి, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రాథోడ్ సంతోష్, సిఐటియు మండల నాయకులు నాగభూషణ్, స్వామి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story