Uppal: బీఆర్‌ఎస్ బూత్ కమిటీల భేటీ హాజరైన రాగిడి లక్ష్మారెడ్డి మహేందర్ రెడ్డి

Uppal: బీఆర్‌ఎస్ బూత్ కమిటీ సభ్యుల విస్తృత స్థాయి సమావేశం ఘనం.

KARUNAKAR, UPPAL
Published on: 28 May 2026 7:43 PM IST
Uppal
X

Uppal: బీఆర్‌ఎస్ బూత్ కమిటీల భేటీ హాజరైన రాగిడి లక్ష్మారెడ్డి మహేందర్ రెడ్డి

ఉప్పల్: మేడ్చల్ నియోజకవర్గంలోని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బోడుప్పల్ సర్కిల్‌ లో బీఆర్‌ఎస్ పార్టీ బూత్ కమిటీ సభ్యుల విస్తృత స్థాయి సమావేశం ఉత్సాహభరితంగా జరిగింది. పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, బోడుప్పల్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు మంద సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో చెంగిచెర్ల ఎక్స్ రోడ్‌ లోని ఓ హోటల్‌ లో నిర్వహించిన ఈ సమావేశానికి మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్‌ఎస్ ఇంచార్జ్, మేడ్చల్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, బీఆర్‌ఎస్ నాయకుడు చామకూర మహేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, డిజిటల్ సభ్యత్వ నమోదు, SIR (ఓటర్ల జాబితా సవరణ) కార్యక్రమాలపై నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అధికారం కోల్పోవడం తాత్కాలికమేనని, విపక్షంలో ఉన్న ఈ సమయం పార్టీని మరింత బలోపేతం చేసుకునే అవకాశమని అన్నారు. ఢిల్లీకి తలవంచే కాంగ్రెస్, బీజేపీలకు భిన్నంగా తెలంగాణ ప్రయోజనాల కోసం హైదరాబాద్ నుంచే నిర్ణయాలు తీసుకునే పార్టీ బీఆర్‌ఎస్ మాత్రమే అని స్పష్టం చేశారు.

గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియా ద్వారా పార్టీ సిద్ధాంతాలను యువతలోకి తీసుకెళ్లే సోషల్ మీడియా వారియర్స్ తయారు చేయడమే లక్ష్యమని తెలిపారు. డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా యువతను పార్టీకి మరింత చేరువ చేయనున్నామని చెప్పారు.

తెలంగాణ పునర్నిర్మాణంలో ఇది రెండో దశ ఉద్యమమని ప్రతి కార్యకర్త భావించి పనిచేయాలని పిలుపునిచ్చారు. బోడుప్పల్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు మంద సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్న కాంగ్రెస్ నాయకులకు భవిష్యత్తులో “70MM సినిమా” చూపిస్తామని హెచ్చరించారు. “డీ అంటే డీ” అన్నట్టుగా తలపడతామని, బాధిత కార్యకర్తలకు లీగల్ సెల్ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.

కార్యకర్తలకు రాజకీయ రక్షణ, ఆత్మగౌరవ భరోసా కల్పించడం పార్టీ బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సామల బుచ్చిరెడ్డి, పోచారం మాజీ చైర్మన్ కొండల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏడవల్లి రఘువర్ధన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు కొల్తూరి మహేష్, దొంతిరి హరిశంకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, కౌడే పోచయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు మనోరంజన్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు నిర్మల, యూత్ అధ్యక్షుడు ప్రభు, జావీద్ ఖాన్ తదితరులు, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, మహిళా నాయకులు, యువ నాయకులు, బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story