Boduppal: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై కాంగ్రెస్ నేతల తీవ్ర విమర్శలు
Boduppal: బహుజనవాదం వీడి దొరవాదం ఎత్తుకున్నారంటూ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై కాంగ్రెస్ నేతల మండిపాటు. మల్లారెడ్డిపై కూడా తీవ్ర విమర్శలు.
Boduppal: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై కాంగ్రెస్ నేతల తీవ్ర విమర్శలు
బోడుప్పల్: బహుజనవాదం, సామాజిక న్యాయం అంటూ ఉద్యమించిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ బీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత తన సిద్ధాంతాలను పక్కనపెట్టి దొరవాదానికి కొమ్ముకాస్తున్నారని కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శించారు. బొమ్మరాశిపేటలో ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. కాంగ్రెస్ నాయకులపై నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.
ఇటీవల బొమ్మరాశిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అంజిరెడ్డి, అనిల్‌రెడ్డి, వజ్రేష్‌యాదవ్, ఉదయసింహారెడ్డి, ఏవీ రెడ్డిల పేర్లను ప్రస్తావిస్తూ వారు ఎవరు? సచివాలయంలో వారికి ఏం పని? అంటూ ప్రశ్నించడంతో పాటు రైతులను బెదిరించడం, భూములకు సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టించడం, అధికారులపై ఒత్తిడి తీసుకురావడం వంటి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
ఈ భూ వ్యవహారం వెనుక సీఎం రేవంత్‌రెడ్డి హస్తం ఉందని రైతులు ఆరోపిస్తున్నారని పేర్కొంటూ సీఎం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ సోమవారం పీర్జాదిగూడలోని బండి కన్వెన్షన్ హాల్‌లో పోచారం, పీర్జాదిగూడ, మేడిపల్లి డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కర్రె రాజేష్, తుంగతుర్తి రవి, బండి శ్రీరాములు గౌడ్, ఘట్‌కేసర్‌లో ఘట్‌కేసర్, ఏదులాబాద్, పోచారం డివిజన్ అధ్యక్షులు బొక్క ప్రభాకర్‌రెడ్డి, సామల అమర్, కర్రె రాజేష్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. బహుజన ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన ప్రవీణ్‌కుమార్ బీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత ఆ పార్టీ నేతల భాషలో మాట్లాడుతున్నారని విమర్శించారు. “బహుజనవాదం వీడి దొరవాదం ఎత్తుకున్నారు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకులపై వ్యక్తిగత ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, ప్రజా సమస్యలపై గతంలో గళమెత్తిన ప్రవీణ్‌కుమార్.. ఇప్పుడు అదే పార్టీ నేతలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం రాజకీయ అవకాశవాదమని విమర్శించారు. “నాడు బీఆర్‌ఎస్ అక్రమాలను ప్రశ్నించిన మీరు.. నేడు ఆ విషయాలను ఎందుకు మరిచిపోయారు?” అని ప్రశ్నించారు. రాజకీయ విమర్శలకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే కాంగ్రెస్ నాయకులపై నిరాధార ఆరోపణలు చేస్తే తగిన రీతిలో సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు. తక్షణమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహిర్గతంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మల్లారెడ్డిపై తీవ్ర విమర్శలు
మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డిపైనా కాంగ్రెస్ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. “మేడ్చల్ నియోజకవర్గానికి పట్టిన శని మల్లారెడ్డి” అంటూ వ్యాఖ్యానించారు. మల్లారెడ్డికి తన ఆస్తులు, వ్యాపారాలపై ఉన్న శ్రద్ధ నియోజకవర్గ ప్రజల సమస్యలపై లేదని ఆరోపించారు. ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్నప్పటికీ నియోజకవర్గంలో తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, ఇతర మౌలిక వసతుల సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదన్నారు.
“ఆస్తులు కూడబెట్టుకోవడంపై చూపిన శ్రద్ధలో కొంతైనా ప్రజా సమస్యల పరిష్కారంపై చూపి ఉంటే మేడ్చల్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందేది” అని కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానించారు. సమావేశంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ దర్గా దయాకర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనుగు జలేందర్‌రెడ్డి, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ముదిగొండ రమేష్, ప్రభాకర్ రెడ్డి, దుర్గ, మణిరాం నాయక్, కర్రె బలరాం, సుక్క జయేందర్, ముల్లి జంగయ్య, సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వినోద్ కుమార్, పోలగోని సహదేవ్ గౌడ్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.




