Sanathnagar: సనత్‌నగర్‌లో డాక్టర్ కోట నీలిమ ఆధ్వర్యంలో ‘సద్భావనా మార్చ్’!
Sanathnagar: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సనత్‌నగర్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ డాక్టర్ కోట నీలిమ ఆధ్వర్యంలో ఎస్సార్ నగర్‌లో సద్భావనా మార్చ్ నిర్వహించారు.
Sanathnagar: సనత్‌నగర్‌లో డాక్టర్ కోట నీలిమ ఆధ్వర్యంలో ‘సద్భావనా మార్చ్’!
సనత్ నగర్: మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ ఆధ్వర్యంలో SR నగర్ బుద్ధనగర్ నుంచి ఉమేష్ చంద్ర విగ్రహం వరకు సద్భావనా మార్చ్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి యాత్ర ప్రారంభించారు. అనంతరం 18 ఏళ్లు నిండిన యువత కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు ఫారం 6ను పంపిణీ చేశారు. తర్వాత రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని అన్నదానం నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ.. యువతను దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయాలు భారతదేశ ప్రగతికి బలమైన పునాది వేశాయని పేర్కొన్నారు. యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించడం, ప్రజాస్వామ్యంలో వారి భాగస్వామ్యాన్ని పెంచడం ఆయన సంస్కరణాత్మక ఆలోచనలకు నిదర్శనమని అన్నారు. సాంకేతిక రంగంలో భారత్‌ను ముందుకు తీసుకెళ్లడంలో రాజీవ్ గాంధీ కీలక పాత్ర పోషించారని ఆమె తెలిపారు.
కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్స్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం ద్వారా భారతదేశాన్ని 21వ శతాబ్దానికి సిద్ధం చేయాలని ఆయన కలలు కన్నారని, ఆ దూరదృష్టి ఫలితంగానే నేడు దేశం సాంకేతిక రంగంలో ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందుతోందని అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం, విద్య, మహిళలు, యువత సంక్షేమంపై దృష్టి సారించడం ద్వారా రాజీవ్ గాంధీ సమగ్ర భారత నిర్మాణానికి కృషి చేశారని కొనియాడారు.
దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి పట్ల ఆయన చూపిన నిబద్ధత నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. రాజీవ్ గాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతోందని పేర్కొన్నారు. సద్భావనా మార్చ్ ద్వారా కుల, మత, ప్రాంత, భాషా భేదాలకు అతీతంగా ప్రజలందరూ ఐక్యంగా ముందుకు సాగాలనే సందేశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తోందన్నారు.
ప్రజాస్వామ్యం కేవలం ఓటు వేసే హక్కుతో మాత్రమే పరిమితం కాకుండా, ప్రతి పౌరుడు తన హక్కులు, బాధ్యతల పట్ల అవగాహన కలిగి సమాజ నిర్మాణంలో భాగస్వామి కావడం ద్వారా మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఓటు హక్కు కోల్పోయిన వారికి తిరిగి అవకాశం కల్పించడం, అర్హత పొందిన యువతను ఓటర్లుగా నమోదు చేయడం వంటి కార్యక్రమాలు ప్రజాస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసే చర్యలని తెలిపారు. రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా యువత, మహిళలు, పేదలు, అణగారిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ ఐక్యంగా, సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మరోవైపు సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ దేశాన్ని ఆధునిక, ప్రగతిశీల భారతదేశంగా తీర్చిదిద్దేందుకు దూరదృష్టితో పనిచేశారని అన్నారు. యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించడం ద్వారా దేశ ప్రజాస్వామ్యంలో యువత భాగస్వామ్యాన్ని పెంచిన ఘనత రాజీవ్ గాంధీదేనని పేర్కొన్నారు.
సాంకేతికతను ప్రోత్సహించి భారతదేశాన్ని ప్రపంచంతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లేందుకు ఆయన వేసిన పునాదులు నేడు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 8 డివిజన్ల అధ్యక్షులు దేవులపల్లి రవికిరణ్, అబ్బాస్ షేరఫ్ , రవికాంత్, శ్రీకాంత్ యాదవ్, నసీర్ అడ్డు, త్రికాల మనోజ్ కుమార్, రమేష్, జగదీశ్ తో పాటు సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పాల్గొన్నారు.




