Hyderabad: ‘స్టూడెంట్ మొబిలిటీ ప్రోగ్రామ్’.. విద్యార్థుల రక్షణకు సీపీ కొత్త ప్లాన్!

Hyderabad: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో విద్యార్థుల సురక్షిత రవాణా కోసం ‘స్టూడెంట్ మొబిలిటీ ప్రోగ్రామ్’ను సీపీ డా. ఎం. రమేష్ ప్రారంభించారు.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 6 Jun 2026 9:18 PM IST
Hyderabad
X

Hyderabad: ‘స్టూడెంట్ మొబిలిటీ ప్రోగ్రామ్’.. విద్యార్థుల రక్షణకు సీపీ కొత్త ప్లాన్!

హైదరాబాద్: విద్యార్థుల రవాణాను మరింత సురక్షితంగా, పారదర్శకంగా, సాంకేతిక ఆధారితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన స్టూడెంట్ మొబిలిటీ ప్రోగ్రామ్ అమలుపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్, ఐపీఎస్., ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు, ప్రతినిధులు మరియు సంబంధిత శాఖల అధికారులతో శనివారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆడిటోరియంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో రవాణా శాఖ అధికారులు, ఆర్టీసీ ప్రతినిధులు, ట్రాఫిక్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSC) సభ్యులు, విద్యా సంస్థల రవాణా నిర్వాహకులు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ విద్యార్థుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విద్యార్థులను తరలించే ప్రతి వాహనం భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించడంతో పాటు సీసీటీవీ కెమెరాలు, జీపీఎస్ ఆధారిత రియల్‌టైమ్ లొకేషన్ ట్రాకింగ్ వ్యవస్థలు, అత్యవసర భద్రతా పరికరాలతో ఉండాలని తెలిపారు. వాహనాల నిర్వహణ, డ్రైవర్ల అర్హతలు, లైసెన్సులు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు తదితర అంశాలపై కఠిన పర్యవేక్షణ అవసరమని పేర్కొన్నారు.

సమావేశంలో సైబరాబాద్ పోలీసులు మరియు SCSC సంయుక్తంగా రూపొందించిన స్టూడెంట్ మొబిలిటీ ప్రోగ్రామ్పై ప్రత్యేక ప్రజెంటేషన్ నిర్వహించారు. విద్యార్థుల రవాణాలో ట్రాఫిక్ రద్దీ (Congestion) తగ్గించడం, నిబంధనల అమలు (Compliance), భద్రత (Safety), అందుబాటు ధరల్లో రవాణా సేవలు (Affordability) కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలని వివరించారు.

స్టూడెంట్ మొబిలిటీ ప్రోగ్రామ్‌లో భాగంగా ప్రత్యేక మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సీపీ వెల్లడించారు. ఈ యాప్ ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రయాణిస్తున్న వాహనానికి సంబంధించిన కీలక సమాచారాన్ని నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. వాహనంలో విద్యార్థుల సంఖ్య నిర్దేశిత పరిమితికి మించి ఉందా లేదా (Overcrowding), వాహనం నడుపుతున్న డ్రైవర్ వివరాలు, డ్రైవింగ్ లైసెన్స్ స్థితి, వాహనం ఫిట్‌నెస్, ప్రయాణ మార్గం, ప్రస్తుత లొకేషన్ వంటి వివరాలు యాప్‌లో అందుబాటులో ఉంటాయని చెప్పారు.

అదేవిధంగా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా విద్యార్థుల రవాణా వాహనాలను రియల్‌టైమ్‌లో పర్యవేక్షించే విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించే అవకాశం ఉండటంతో పాటు విద్యార్థుల భద్రత మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.

విద్యార్థుల డ్రాపింగ్, పికప్ సేవలు, పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు, క్రీడా శిక్షణా కేంద్రాలకు వెళ్లే సమయంలో ఎదురయ్యే రవాణా సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని సీపీ తెలిపారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించడం, భద్రతా ప్రమాణాల అమలు, సమర్థవంతమైన రవాణా వ్యవస్థ ఏర్పాటు ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు.

సమావేశంలో పాల్గొన్న ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులు ట్రాఫిక్ నిర్వహణ, ఆర్టీఓ అనుమతులు, లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్ మరియు ఇతర కార్యనిర్వహణ అంశాలకు సంబంధించిన సమస్యలను సీపీ దృష్టికి తీసుకువచ్చారు. వాటిపై స్పందించిన సీపీ, సంబంధిత శాఖలతో సమన్వయం చేసి సాధ్యమైన పరిష్కారాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

భారీ దృష్టికోణంతో రూపొందించిన ఈ కార్యక్రమం ప్రారంభ దశలో కొన్ని చిన్న సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ, వాటిని అధిగమిస్తూ ముందుకు సాగాలని సీపీ సూచించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపే అవకాశం ఉందని తెలిపారు.

విద్యార్థుల భద్రత, తల్లిదండ్రుల విశ్వాసం, సాంకేతిక ఆధారిత పర్యవేక్షణ, ట్రాఫిక్ నిర్వహణ మరియు సమర్థవంతమైన రవాణా వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకుని స్టూడెంట్ మొబిలిటీ ప్రోగ్రామ్‌ను అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ సమావేశంలో సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్, శేరిలింగంపల్లి ఎడిసిపి హనుమంతరావు, ట్రాన్స్పోర్ట్ ఇన్స్పెక్టర్ శీతల్ సోహన్, మేడ్చల్ డిటిఓ శ్రీనివాస్, ఆర్టీసీ డిఎం మియాపూర్-1 ప్రశాంత్ మియాపూర్ -2 వెంకటేశం ఇతర ఉన్న అధికారులు పాల్గొన్నారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY

Next Story