Hyderabad: వీబీ జీరాంజీ పథకంపై సిపిఎం ఫైర్.. చెరుపల్లి సంచలన వ్యాఖ్యలు

Hyderabad: కేంద్రం తెచ్చిన వీబీ జీరాంజీ పథకం "కొండ నాలుకకు మందు పెడితే ఉన్న నాలుక ఊడినట్లు" ఉందని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మండిపడ్డారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 9 July 2026 10:32 AM IST
Hyderabad
X

Hyderabad: వీబీ జీరాంజీ పథకంపై సిపిఎం ఫైర్.. చెరుపల్లి సంచలన వ్యాఖ్యలు

Hyderabad: కొండ నాలుకకు మందు పెడితే ఉన్న నాలుక ఊడినట్లు అన్న చందంగా వీబీ జీరాంజీ పథకం ఉన్నదని మాజీ ఎమ్మెల్సీ, మాజీ సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు ఎద్దేవా చేశారు.

ఎల్బీనగర్ మన్సూరాబాద్_ లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఉపాధి హామీ గతంలో వామపక్షాల చొరవతో యుపిఎ ప్రభుత్వం తెచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం NREGS ద్వారా కోట్లాదిమందికి ఉపాధితో పాటు కొనుగోలు శక్తి పెరిగిందని గుర్తు చేశారు. ఈ పథకం ద్వారా చెక్ డ్యాముల నిర్మాణం, చెరువుల తవ్వకం, మట్టి తవ్వకం వంటివి చేస్తూ గ్రామ ప్రజలు ఉపాధి పొందేవారని తెలిపారు.

ప్రజామోదం పొందిన గత చట్టాన్ని అమలు చేయకుండా ఇటీవల బీజేపీ ప్రభుత్వం తెచ్చిన వీబీ జీరాంజీ చట్టాన్ని అమలు కోసం కేంద్రం నిరంకుశంగా రాష్ట్రాలపై రుద్దుతోందని ఆరోపించారు. రాష్ట్రాలు పాత చట్టాలు అమలు చేయకుంటే కటిక నిరుపేదలకు ఉపాధి లభించకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

గత ఏడాది మన రాష్ట్రంలో 21 కోట్ల పని దినాలు ఉంటే కేవలం 7 కోట్ల పని దినాలు మాత్రమే వినియోగించుకున్నారని కేంద్ర ప్రభుత్వం సాకు చూపుతూ వచ్చే ఏడాది పని దినాలు మరింత తగ్గిపోతాయని తెలుస్తోందని అన్నారు.

ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మేనిఫెస్టోలో _120 రోజుల పని దినాలు, 400 రూపాయల కూలీ_తో NREGS అమలు చేస్తామని చెప్పారని, ఇటీవల క్యాబినెట్ మీటింగ్ లో కేంద్రం తెచ్చిన వీబీ జీరాంజీ పథకం అమలు చేస్తాం కానీ పేరు మార్చి సుప్రీంకోర్టు పోతామనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.

గతంలో ఉపాధి పథకంలో 90% కేంద్రం, 10% రాష్ట్రం నిధులు ఇచ్చేవని, నూతన చట్టంలో కేంద్రం 60%, రాష్ట్రం 40% భరించాలని, అది కూడా ముందు రాష్ట్రం చెల్లిస్తేనే కేంద్రం మిగతా వాటిని ఇస్తుందని తెలిపారు. దీంతో కూలీ పని దినాలు తగ్గి పూర్తిగా ఈ పథకం నీరుగారే ప్రయత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

గత ఏడాది రాష్ట్రం 1.21 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే ఈ ఏడాది 95 వేల కోట్లకు తగ్గించారని, దీంతో 26 వేల కోట్లు తగ్గిందని పేర్కొన్నారు. 100 రోజుల పని దినాలను 120 రోజులు చేశారని, అసలే బడ్జెట్ లేనప్పుడు నూతన పథకానికి 40% నిధులు ఎలా కేటాయిస్తారని ముఖ్యమంత్రి ఉపాధి కూలీలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.

రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 64 గ్రామపంచాయతీలు మున్సిపాలిటీల్లో కలిశాయని, 7 ఏళ్ల క్రితం 16 మేజర్ గ్రామపంచాయతీలు, ఫ్యూచర్ సిటీలో 56 గ్రామాలు విలీనమయ్యాయని తెలిపారు. మొత్తం 120 గ్రామాలు నగర పరిధిలో ఉండడంతో అక్కడి ప్రజలకు పని దొరక వలసలు వెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి పాత ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, దానిని మున్సిపాలిటీల్లో కూడా అమలు చేయాలని సిపిఎం తరపున డిమాండ్ చేస్తున్నట్లు హెచ్చరించారు. కేంద్రం తెచ్చిన నూతన చట్టాన్ని అమలు చేస్తే 126 గ్రామపంచాయతీల ప్రజలకు ఉపాధి దొరక్క వలసబాట పట్టే ప్రమాదం ఉందని ముందుగానే హెచ్చరిస్తున్నట్లు సూచించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story