Cherlapally: బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు.. రైతులు, డ్రైవర్ల ఇక్కట్లు

Cherlapally: మేడ్చల్ జిల్లా చర్లపల్లిలోని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL) ముందు సీపీఎం ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.

ASHOK, KAPRA
Published on: 28 April 2026 8:36 PM IST
Cherlapally
X

Cherlapally: బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు.. రైతులు, డ్రైవర్ల ఇక్కట్లు

Cherlapally: ఆయిల్ కంపెనీలు సృష్టించిన కృత్రిమ ఇంధన కొరతను వెంటనే అరికట్టాలని, కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఎం మేడ్చల్ జిల్లా కార్యదర్శి పి.సత్యం డిమాండ్ చేశారు. ఎన్నికల అనంతరం ధరలు పెంచేందుకే ఈ కొరతను సృష్టిస్తున్నారని ఆరోపించారు.

సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చర్లపల్లిలోని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ కంపెనీ ఎదుట మంగళవారం నిర్వహించిన ధర్నాలో పి.సత్యం మాట్లాడుతూ.. కృత్రిమ కొరత కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక పెట్రోల్ బంకులు ‘నో స్టాక్’ బోర్డులతో మూత పడుతున్నాయని తెలిపారు. దీంతో పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేక వ్యవసాయ రంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతోందని, పంటలు చేతికి రాక రైతులు నష్టపోతున్నారని అన్నారు.

హైదరాబాద్ నగరంలో ఉపాధిపై కూడా తీవ్ర ప్రభావం పడిందని, ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఇంధనం కోసం గంటల తరబడి బంకుల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. లాభాపేక్ష కోసం ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని విమర్శించారు.

దేశంలో చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని చెబుతున్నప్పటికీ కృత్రిమ కొరత ఎందుకు కొనసాగుతోందో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ప్రశ్నించారు. ఇతర దేశాలు ముందుచూపుతో నిల్వలు పెంచుకుంటుంటే, ప్రధాని మోడీకి ప్రతిపక్షాలను చీల్చడం లో ఉన్న శ్రద్ధ ఇంధన భద్రతపై లేదని విమర్శించారు. రష్యా, ఇరాన్ నుంచి చౌకగా చమురు దిగుమతి చేసుకునే అవకాశాలు ఉన్నప్పటికీ వాటిని వినియోగించడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కృత్రిమ కొరతను నివారించి, డిమాండ్‌కు అనుగుణంగా ఆయిల్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జె.చంద్రశేఖర్, కోమటి రవి, జి.శ్రీనివాసులు, ఎర్ర అశోక్, రాజశేఖర్ ప్రసంగించారు. జిల్లా కమిటీ సభ్యులు ఎన్.శ్రీనివాస్, ఎం.శంకర్, బి.లింగస్వామి, నరేష్, సిహెచ్.యాదయ్య, పి.గణేష్, ఎం.ఎస్. రావు, బీవీ సత్యనారాయణ, దేవిరెడ్డి, శరత్, సృజన, సఫీయా, జి.యాదగిరిరావు, బి.నర్సింగ్ రావు, టి.నరసింహ, మణికంఠ, టి.రవీందర్ రెడ్డి, రాంబాబు, లక్ష్మీనారాయణ, విజయ తదితరులు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA

Next Story