LB Nagar: షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో రూ.74 లక్షల సైబర్ మోసం!
LB Nagar: ఎల్బీనగర్ పరిధిలో షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు రూ.74 లక్షలు మోసం చేశారు.
LB Nagar: షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో రూ.74 లక్షల సైబర్ మోసం!
LB Nagar: ఎల్బీనగర్ ....షేర్ మార్కెట్లో భారీ లాభాలు వస్తాయని ఆశ చూపి, వాట్సాప్ గ్రూప్ ద్వారా పరిచయం పెంచుకుని ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు రూ.74 లక్షలు మోసం చేసిన ఘటన మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చైతన్యపురిలోని న్యూమారుతీనగర్‌కు చెందిన భట్టు స్వరాజ్‌కుమార్ (64) ప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందారు. గత నెల జూన్ 8న ఆయనను గుర్తుతెలియని వ్యక్తులు 'ఆల్ఫా ఇన్వెస్టర్స్' పేరుతో నిర్వహిస్తున్న వాట్సాప్ గ్రూప్‌లో చేర్చారు. ఆ గ్రూప్‌లో అనన్య మెహరా, ప్రణవ్ హరిదాసన్ పేర్లతో ఉన్న వ్యక్తులు అడ్మిన్లుగా వ్యవహరిస్తూ సభ్యులకు షేర్ మార్కెట్ పెట్టుబడులపై సలహాలు ఇస్తూ నమ్మకం కల్పించారు.
షేర్ల కొనుగోలు, విక్రయం, బ్లాక్ ట్రేడింగ్ వంటి అంశాలపై పెట్టుబడిదారులకు అవగాహన కల్పిస్తున్నట్లు నటిస్తూ, పెట్టుబడిపై 5 శాతం నుంచి 50 శాతం వరకు లాభాలు ఖాయమని ప్రచారం చేశారు. అదే గ్రూప్‌లో ఉన్న అదితి అయ్యర్ పేరుతో మరో సభ్యురాలు తాను తరచూ భారీ లాభాలు పొందుతున్నట్లు సందేశాలు పంపడంతో బాధితుడికి వారిపై మరింత విశ్వాసం ఏర్పడింది.
దాదాపు 20 రోజులపాటు గ్రూప్‌లో జరుగుతున్న చర్చలు, లాభాల పోస్టులను గమనించిన స్వరాజ్‌కుమార్ చివరకు వారి మాటలు నమ్మి, వారు సూచించిన మొబైల్ అప్లికేషన్‌లో తన వివరాలు నమోదు చేసుకున్నారు. తొలుత రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టగా, యాప్‌లో భారీ లాభాలు వచ్చినట్లు నకిలీ గణాంకాలు చూపించారు. వాటిని నిజమని భావించిన ఆయన దశలవారీగా మరిన్ని మొత్తాలు చెల్లిస్తూ మొత్తం రూ.74 లక్షలు పెట్టుబడి పెట్టారు.
కొంతకాలం తర్వాత పెట్టుబడి సొమ్ముతో పాటు లాభాలను వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించగా, ముందుగా మరికొంత డబ్బు చెల్లిస్తేనే విత్‌డ్రా చేయవచ్చని నిందితులు తెలిపారు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు తాను సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించి మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి, వాట్సాప్ గ్రూప్ నిర్వాహకులు, బ్యాంకు లావాదేవీలు, పెట్టుబడి పేరుతో వినియోగించిన యాప్‌పై దర్యాప్తు ప్రారంభించారు. పెట్టుబడుల విషయంలో తెలియని వ్యక్తుల సూచనలు, వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా వచ్చే పెట్టుబడి ఆఫర్లను నమ్మవద్దని, అనుమానాస్పద లింకులు, యాప్‌ల ద్వారా డబ్బు పెట్టుబడి పెట్టే ముందు అధికారికంగా ధ్రువీకరించుకోవాలని పోలీసులు సూచించారు.




