Hyderabad: పాటిగడ్డ ఫ్లైఓవర్ రూట్‌లో మార్పులు.. కోట నీలిమ కృతజ్ఞతలు!
Hyderabad: పాటిగడ్డ–రసూల్‌పుర ఫ్లైఓవర్ రూట్ మ్యాప్‌లో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మార్పులు చేసినందుకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు కోట నీలిమ ధన్యవాదాలు తెలిపారు.
Hyderabad: పాటిగడ్డ ఫ్లైఓవర్ రూట్‌లో మార్పులు.. కోట నీలిమ కృతజ్ఞతలు!
Hyderabad: పాటిగడ్డ కాలనీ ప్రజల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ప్రతిపాదిత పాటిగడ్డ–రసూల్‌పుర జంక్షన్ ఫ్లైఓవర్ మార్గాన్ని పునఃసమీక్షించి, ప్రజలకు నష్టం కలగకుండా రూట్ మ్యాప్‌లో మార్పులు చేసిన జీహెచ్‌ఎంసీ కమిషనర్ శ్రీ ఆర్.వి. కర్ణన్‌కు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ కోట నీలిమ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ, గతంలో పాటిగడ్డ కాలనీ ప్రజలతో కలిసి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను కలిసి ఫ్లైఓవర్ ప్రతిపాదిత మార్గాన్ని పునఃపరిశీలించాలని వినతిపత్రం సమర్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ ప్రతిపాదిత మార్గం అమలైతే సుమారు 40 ఇళ్లు, వందలాది కుటుంబాలు, అలాగే చారిత్రక, వారసత్వ ప్రాధాన్యం కలిగిన నిర్మాణాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అంతేకాకుండా స్థానికులు సూచించిన ప్రత్యామ్నాయ రూట్ మ్యాప్‌ను కూడా అధికారులకు అందజేశామని చెప్పారు.
స్థానిక ప్రజల ఆందోళనలు, సూచనలను సానుకూలంగా స్వీకరించి రూట్ మ్యాప్‌లో తగిన మార్పులు చేయడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్పందించి ఫ్లైఓవర్ రూట్ మ్యాప్‌లో మార్పులు చేయించిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ శ్రీ ఆర్.వి. కర్ణన్, సంబంధిత అధికారులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అభివృద్ధి పనులను వేగవంతంగా కొనసాగిస్తూనే సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనకు నిదర్శనమని డాక్టర్ కోట నీలిమ అన్నారు.
ఈ కార్యక్రమంలో విశాల్ సూదం, మహమ్మద్ గౌస్, చిరంజీవి, ఒబైద్, సుల్తాన్, నసీర్, రఫిక్, ఇబ్రహీం తదితర స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




