Medchal: మేడ్చల్ చెత్త లారీల బంద్‌కు సంఘీభావం
Medchal: మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేతకు డిమాండ్. సీఎం రేవంత్ రెడ్డి హామీని అమలు చేయాలని కోరుతూ జూలై 10 నుంచి పాదయాత్రలు చేపడుతున్నట్లు వెల్లడి.
Medchal: మేడ్చల్ చెత్త లారీల బంద్‌కు సంఘీభావం
మేడ్చల్ జిల్లా: యాంటి డంపింగ్ యార్డు దమ్మాయిగూడ జేఏసీ శనివారం చేపట్టనున్న చెత్త లారీల బంద్‌కు జవహర్‌నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ సంఘీభావం ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డంపింగ్ యార్డు శాశ్వత పరిష్కారంపై ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కమిటీ చైర్మన్ షేక్ షావలి డిమాండ్ చేశారు.
జవహర్‌నగర్‌లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో మాట్లాడిన ఆయన.. డంపింగ్ యార్డు సమస్యపై గత 11 ఏళ్లుగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మే 4న ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి ఇప్పటివరకు అమలు కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చెత్త లారీల బంద్ పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధమైన, శాంతియుత నిరసన కార్యక్రమమని పేర్కొన్నారు.
శాంతియుతంగా జరిగే ఆందోళనను అడ్డుకునేలా అరెస్టులు చేయడం, తప్పుడు కేసులు నమోదు చేయడం డంపింగ్ యార్డు బాధితులను మోసగించడమేనని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, లేదంటే ప్రజా ఉద్యమాలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.
10 నుంచి 20 వరకు పాదయాత్రలు
డంపింగ్ యార్డు సమస్యపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జూలై 10 నుంచి 20 వరకు వివిధ కాలనీల్లో ప్రజా చైతన్య పాదయాత్రలు నిర్వహించనున్నట్లు షేక్ షావలి తెలిపారు. శాంతినగర్, గబ్బిలాలపేట, రాజీవ్ గాంధీనగర్, ప్రగతినగర్, కార్మిక్‌నగర్, మల్కారం, శివాజీనగర్, విలాంగుల కాలనీ, బాలాజీనగర్ తదితర ప్రాంతాల్లో ఈ పాదయాత్రలు కొనసాగుతాయని చెప్పారు.
సమావేశంలో మాజీ ఉపసర్పంచ్ ఆర్. నర్సింహ గౌడ్, కో-కన్వీనర్లు అనురాధ, వి. ప్రవీణ్, పెర్క సునీత, పి. శివబాబు, చంద్రమౌళి, సింగరాయ గౌడ్‌తో పాటు వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొని, డంపింగ్ యార్డు తొలగింపు ఉద్యమానికి ప్రజలు పెద్దఎత్తున మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.




