Ghatkesar: నేడే తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్..
Ghatkesar: ఘట్‌కేసర్ పరిధిలోని ఔషాపూర్‌లో జూన్ 30న జరగనున్న బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశ ఏర్పాట్లను ఎంపీ ఈటల రాజేందర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు
Ghatkesar: నేడే తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్..
ఘట్‌కేసర్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేడు (జూన్ 28) తెలంగాణకు రానున్న నేపథ్యంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శనివారం ఘట్‌కేసర్ సర్కిల్ పరిధి ఔషాపూర్‌లో బీజేపీ మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి లతో కలిసి పర్యటించి ఈ నెల 30న జరగనున్న రాష్ట్ర స్థాయి సమావేశ ఏర్పాట్లను పరిశీలించారు.
రాక్ ఎన్‌క్లేవ్ కన్వెన్షన్ హాల్‌లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి పార్టీ నాయకులతో సమావేశమై కార్యక్రమ విజయవంతంపై చర్చించారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ, జూన్ 28 నుంచి 30 వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణలో విస్తృతంగా పర్యటించనున్నారని తెలిపారు.
ఈ పర్యటన ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపడం, రాబోయే రాజకీయ కార్యాచరణపై దిశానిర్దేశం చేయడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
జూన్ 28న హైదరాబాద్‌కు చేరుకునే నితిన్ నబీన్, శంషాబాద్‌లో బీజేపీ రంగారెడ్డి జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
అలాగే రాష్ట్రంలోని సుమారు పది జిల్లాల పార్టీ కార్యాలయాలను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.
అనంతరం హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించే సమావేశంలో రాష్ట్ర నాయకులు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమై పార్టీ సంస్థాగత బలోపేతంపై చర్చించనున్నారు.
జూన్ 29న వరంగల్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువతతో పాటు వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ విస్తరణ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనున్నారు.
జూన్ 30న ఘట్‌కేసర్ మండలం ఔషాపూర్‌లో నిర్వహించే రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొని రాష్ట్ర పార్టీ పదాధికారులు, జిల్లా నాయకులు, ముఖ్య కార్యకర్తలకు భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై మార్గనిర్దేశం చేయనున్నారు.
తెలంగాణలో పార్టీ విస్తరణ, బూత్ స్థాయి బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాట కార్యాచరణకు సంబంధించి కీలక సూచనలు చేయనున్నట్లు ఈటల వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని ఈటల రాజేందర్ విమర్శించారు. రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు సహా అన్ని వర్గాల్లో అసంతృప్తి పెరుగుతోందని, ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని పేర్కొన్న ఈటల, నితిన్ నబీన్ పర్యటన తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపుతుందని, రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డపై బీజేపీ విజయపతాకం ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు పట్లోళ్ల విక్రం రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తిరుమలరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




