Malkajgiri: మల్కాజిగిరి ఆత్మలింగ గణపతి ఆలయంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

Malkajgiri: మల్కాజిగిరి ఆత్మలింగ మహాగణపతి ఆలయంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు.

Bodike Manohar, Malkajgiri
Published on: 10 Oct 2026 11:24 PM IST
Malkajgiri
X

Malkajgiri: మల్కాజిగిరి ఆత్మలింగ గణపతి ఆలయంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

మల్కాజిగిరి: మల్కాజిగిరి బాల సరస్వతి నగర్‌లోని ఆత్మలింగ మహాగణపతి దేవస్థానంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను కాలనీవాసులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో భాగంగా మొదటి రోజు నిర్వహించిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో కాలనీలోని మహిళలు, ఆడపడుచులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు.

ఈ సందర్భంగా మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి ఆలయానికి తీసుకొచ్చారు. సాంప్రదాయ దుస్తులు ధరించి, బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఆడిపాడారు. పూల సోయగాలు, మహిళల కోలాటాలు, బతుకమ్మ పాటలతో ఆలయ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. చిన్నారులు సైతం ఉత్సాహంగా పాల్గొని వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

బతుకమ్మ నవరాత్రుల్లో తొలి రోజైన ఎంగిలిపూల బతుకమ్మను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ తెలంగాణ ఆడపడుచులు తమ సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శివశర్మ బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని ప్రార్థించారు.

బతుకమ్మ పండుగ మహిళల్లో ఐక్యతను పెంపొందించడంతో పాటు, ప్రకృతిలో లభించే పూలకు ప్రాధాన్యాన్ని తెలియజేస్తుందని ఈ వేడుకలు చాటిచెప్పాయి. కాలనీలోని మహిళలు, చిన్నారులు, ఇతర కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri