Khajaguda: ఖాజాగూడలో ట్రాఫిక్‌కు ఆటంకం లేకుండా పనులు: సీపీ రమేష్
Khajaguda: ఖాజాగూడ జంక్షన్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ పనులను సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ పరిశీలించి, వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.
Khajaguda: ఖాజాగూడలో ట్రాఫిక్‌కు ఆటంకం లేకుండా పనులు: సీపీ రమేష్
ఖాజాగూడ: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాజాగూడ జంక్షన్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ మంగళవారం సందర్శించారు. అక్కడ జరుగుతున్న ఫ్లైఓవర్ మరియు అండర్‌పాస్ నిర్మాణ పనుల పురోగతిని ఆయన క్షేత్రస్థాయిలో సమీక్షించారు.
నిర్మాణ పనుల నేపథ్యంలో వాహనదారులకు, ప్రజలకు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై జీహెచ్‌ఎంసీ, విద్యుత్ శాఖ మరియు పోలీస్ ఉన్నతాధికారులతో సీపీ సుదీర్ఘంగా చర్చించారు. పనులకు సంబంధించి పైప్‌లైన్ల ఏర్పాటు, విద్యుత్ లైన్ల మార్పులు మరియు సాంకేతిక అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం, రాయదుర్గం పోలీస్ స్టేషన్‌ను తాత్కాలికంగా తరలించేందుకు అనువైన స్థలంగా భావిస్తున్న మణికొండలోని జీహెచ్‌ఎంసీ కమిటీ హాల్‌ను సీపీ పరిశీలించారు. ప్రజలకు, పోలీస్ సిబ్బందికి ఏవిధంగా సౌకర్యవంతంగా ఉంటుందనే అంశంపై అధికారులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా సీపీ డా. ఎం. రమేష్ మాట్లాడుతూ... "ఫ్లైఓవర్ నిర్మాణ సమయంలో వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి. ట్రాఫిక్ సజావుగా సాగేందుకు ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలి. రాయదుర్గం పోలీస్ స్టేషన్ తాత్కాలిక ఏర్పాటుకు తగిన ఏర్పాట్లు చేయాలి" అని ఆదేశించారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్, ట్రాఫిక్ డీసీపీ రవికుమార్, మాదాపూర్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ హనుమంత్ రావు, ఏసీపీలు చంద్రశేఖర్, శ్రీధర్, రాయదుర్గం సీఐ భూపతి, ట్రాఫిక్ సీఐ పవన్ తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.




