AS Rao Nagar: ప్రజల సమస్యలపై పోరాడేందుకే రాజకీయాల్లోకి వచ్చా: ఆకాష్ కొల్లూరు!
AS Rao Nagar: ప్రజల సమస్యలపై పోరాడేందుకే రాజకీయాల్లోకి వచ్చానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆకాష్ కొల్లూరు శుక్రవారం ఏఎస్ రావు నగర్‌లో పేర్కొన్నారు.
AS Rao Nagar: ప్రజల సమస్యలపై పోరాడేందుకే రాజకీయాల్లోకి వచ్చా: ఆకాష్ కొల్లూరు!
హైదరాబాద్: హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రక్షణ సేన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు గోగికర్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఏఎస్ రావు నగర్‌లోని కినారా గ్రాండ్ హోటల్‌లో పట్టభద్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం, మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆకాష్ కొల్లూరు మాట్లాడుతూ పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి..
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గోల్డ్ మెడల్ సాధించి, అనంతరం జర్నలిజం రంగంలోకి ప్రవేశించి పలు ప్రముఖ పత్రికలు, టీవీ ఛానెళ్లలో పనిచేశానని తెలిపారు. ప్రజలకు మరింత సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన తనకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రత్యర్థి అభ్యర్థులతో బహిరంగ చర్చకు సిద్ధం
విద్య, ఉపాధి, నిరుద్యోగం, ప్రజా సమస్యలు సహా ఏ అంశంపైనైనా ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులతో ముఖాముఖి చర్చకు సిద్ధంగా ఉన్నానన్నారు. ఇప్పటికే బహిరంగ సవాల్ విసిరినప్పటికీ ఇప్పటివరకు ఎవరూ ముందుకు రాలేదని పేర్కొన్నారు.
విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రూ.1,000 కోట్లు కేటాయిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు.
మెగా డీఎస్సీ, పీఆర్సీ హామీలు ఏమయ్యాయి?
నిరుద్యోగులకు ఇచ్చిన మెగా డీఎస్సీ హామీ, ఉద్యోగులకు ఇచ్చిన పీఆర్సీ హామీ ఏమయ్యాయని ప్రశ్నించారు. పెన్షన్ల చెల్లింపులు, వైద్యుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలం
హోంశాఖ ముఖ్యమంత్రి వద్దే ఉన్నప్పటికీ రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
జర్నలిస్టులందరికీ పే స్కేల్ అమలు చేయాలి
తాను కూడా జర్నలిస్టుగా పనిచేశానని, జర్నలిస్టుల సమస్యలపై తనకు అవగాహన ఉందని ఆకాష్ కొల్లూరు తెలిపారు. జర్నలిజం రంగంలో పనిచేస్తున్న పేద జర్నలిస్టుల ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులందరికీ పే స్కేల్ అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ప్రకటనలను కేవలం కొన్ని పత్రికలు, టీవీ ఛానెళ్లకే పరిమితం చేయడం సరికాదన్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా అర్హత కలిగిన అన్ని పత్రికలు, ఛానెళ్లకు ప్రభుత్వ ప్రకటనలను న్యాయబద్ధంగా కేటాయించాలని కోరారు.
అన్ని మతాలు, వర్గాల్లోని నిరుపేదలకు న్యాయం జరగాలి
మైనార్టీల సంక్షేమాన్ని ఒకే మతానికి పరిమితం చేయకుండా, అన్ని మతాల్లోని నిరుపేదలను ప్రభుత్వం గుర్తించాలని సూచించారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ తదితర మతాలకు చెందిన పేదలకు సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
చట్టసభల్లో ప్రజల గొంతుకగా నిలుస్తా
తనను పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నుకుంటే విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, జర్నలిస్టులు, వైద్యులు సహా అన్ని వర్గాల ప్రజల సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించి, వాటి పరిష్కారం కోసం పోరాడతానని ఆకాష్ కొల్లూరు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులు పాల్గొన్నారు.




