Uppal: నారపల్లిలో దర్గా నిర్మాణం? నిజం తేల్చిన ఫారెస్ట్ అధికారులు
Uppal: నారపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో దర్గా నిర్మాణం జరుగుతుందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై అటవీ శాఖ అధికారులు స్పందించారు.
Uppal: నారపల్లిలో దర్గా నిర్మాణం? నిజం తేల్చిన ఫారెస్ట్ అధికారులు
ఉప్పల్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నారపల్లి–I రిజర్వ్ ఫారెస్ట్ (భాగ్యనగర్ నందనవనం పార్క్)పై సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న తప్పుడు ప్రచారం కలకలం రేపుతోంది. అటవీ ప్రాంతంలో దర్గా నిర్మాణం జరుగుతోంది అంటూ ప్రచారం జరుగుతున్న సమాచారం పూర్తిగా అసత్యమని అడవి శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఉప్పల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శరత్ చంద్ర రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, నారపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో ఎలాంటి కొత్త నిర్మాణ కార్యకలాపాలు జరగడం లేదని, దర్గా నిర్మాణం జరుగుతోందన్న ప్రచారం నిరాధారమని తెలిపారు.
ఈ తప్పుడు ప్రచారం ప్రజల్లో అపోహలు, ఉద్రిక్తతలు సృష్టించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఉప్పల్ రేంజ్‌కు చెందిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎం. రంజిత్ కుమార్ మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా అసత్య సమాచారం వ్యాప్తి చేస్తున్నారని పేర్కొన్నారు. ఫిర్యాదు ఆధారంగా మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా విచారణ కొనసాగుతోంది. ఇలాంటి అసత్య వదంతులను ప్రజలు నమ్మకూడదని, వాటిని షేర్ చేయకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.




