Pargi: పరిగి సరస్వతీ శిశు మందిర్లో అగ్నిమాపక శాఖ అవగాహన సదస్సు!
Pargi: వికారాబాద్ జిల్లా పరిగి శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో విద్యార్థులకు దీపావళి అగ్ని ప్రమాదాల నివారణ, భద్రతా నియమాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
Pargi: పరిగి సరస్వతీ శిశు మందిర్లో అగ్నిమాపక శాఖ అవగాహన సదస్సు!
Pargi: దీపావళి పండుగను ప్రమాదరహితంగా, సురక్షితంగా జరుపుకోవాలని పరిగి అగ్నిమాపక శాఖ అధికారులు విద్యార్థులకు సూచించారు. పరిగి పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు దీపావళి సందర్భంగా బాణాసంచా పేల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పరిగి అగ్నిమాపక శాఖ అధికారి ఎన్. సేవ్యా నాయక్ పాల్గొని దీపావళి పండుగ విశిష్టతను వివరిస్తూ బాణాసంచా కాల్చే సమయంలో పాటించాల్సిన భద్రతా నియమాలను వివరించారు.వాహనాలకు, విద్యుత్ పరికరాలకు దూరంగా టపాసులు కాల్చాలని, ఇరుకైన ప్రదేశాల్లో బాణాసంచా పేల్చకూడదని సూచించారు.
చిన్నపిల్లలతో పెద్ద టపాసులు కాల్చించరాదని, టపాసులు కాల్చేటప్పుడు కళ్లకు రక్షణగా అద్దాలు, చేతులకు రక్షణ కవచాలు, పాదాలకు చెప్పులు ధరించాలని తెలిపారు. గాజు సీసాలు, ఇతర పాత్రల్లో టపాసులు పెట్టి పేల్చడం ప్రమాదకరమని హెచ్చరించారు.
అనుకోకుండా దుస్తులకు నిప్పంటుకుంటే Stop, Drop, Roll (ఆగడం, నేలపై పడుకోవడం, దొర్లడం) అనే పద్ధతిని పాటించాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ భద్రతా నియమాలను తమ కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల వారికి కూడా తెలియజేయాలని సూచించారు.
ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవాలని అగ్నిమాపక అధికారి కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి పి. భాగ్యలక్ష్మి, అగ్నిమాపక శాఖ సిబ్బంది, పాఠశాల ఆచార్యులు, మాతాజీలు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.




