Hyderabad: ఫాక్స్ సాగర్ పునరుద్ధరణ మినీ ట్యాంక్ బండ్‌గా జీడిమెట్ల చెరువు

Hyderabad: జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా మార్చేందుకు హైడ్రా చర్యలు ప్రారంభించింది. ఏడాదిలో ₹75 కోట్లతో పనులు పూర్తి చేస్తామని ఏవీ రంగనాథ్ వెల్లడి.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 30 Oct 2026 9:03 PM IST
Hyderabad
X

Hyderabad: ఫాక్స్ సాగర్ పునరుద్ధరణ మినీ ట్యాంక్ బండ్‌గా జీడిమెట్ల చెరువు

హైదరాబాద్: లేక్ సిటీగా పేరుగాంచిన హైద‌రాబాద్‌లో మ‌రో చారిత్ర‌క చెరువును పూర్తి స్థాయిలో పున‌రుద్ధ‌రించేందుకు హైడ్రా రంగంలోకి దిగింది. జీడిమెట్లలోని ఫాక్స్ సాగ‌ర్ చెరువును మినిట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దాల‌ని హైడ్రా అడుగులు వేస్తోంది. 129 ఏళ్ల చరిత్ర ఉన్నఈ చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

త్వ‌ర‌లో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఈ చెరువు పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు ప్రారంభించ నున్న నేప‌థ్యంలో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ శుక్ర‌వారం ఫాక్స్ సాగ‌ర్‌ను క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించారు. హైడ్రా అద‌న‌పు క‌మిష‌న‌ర్ డి. ఆనంద్‌కుమార్‌, ఏసీపీ పి. తిరుమ‌ల్ క‌మిష‌న‌ర్ వెంట ఉన్నారు.

చెరువు ప్ర‌స్తుత ప‌రిస్థితిని క్షేత్ర స్థాయిలో హైడ్రా క‌మిష‌న‌ర్ ప‌రిశీలించారు. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ (అసఫ్ జా VI) హయాంలో 1897లో నిర్మించిన చారిత్రక ఫాక్స్ సాగర్ చెరువు ఉత్తర హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ ప్రాంతాల ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు వ్యవసాయానికి ప్రధాన ఆధారంగా నిలిచేద‌ని ఇంత‌టి ప్రాధాన్యం ఉన్న ఈ చెరువు కాలుష్య జ‌లాల‌తో నిండిపోవ‌డ‌మే కాకుండా.. క‌బ్జాల‌కు గురైంద‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ చెప్పారు.

దాదాపు 490 ఎక‌రాల ఈ చెరువు ప‌రిధి ఉండ‌గా.. 150 ఎక‌రాల మేర ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురైన‌ట్టు తెలుస్తోంద‌ని.. క‌బ్జాల‌ను తొల‌గిస్తామ‌న్నారు. ఎల్‌నినో ప్ర‌భావం ఉన్న స‌మ‌యంలో ఈ నీటిని వినియోగించుకోలేని దుస్థితిలోకి చెరువు నెట్ట‌బ‌డింద‌ని.. మ‌ళ్లీ జీవ‌క‌ళ తీసుకురావ‌డ‌మే హైడ్రా ల‌క్ష్య‌మ‌ని మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పారు.

మినీ ట్యాంక్‌బండ్‌.. ప్ర‌భుత్వ ల‌క్ష్యం

జీడిమెట్ల‌లోని ఫాక్స్ సాగ‌ర్ ను మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి నిర్దేశించార‌ని.. ఏడాదిలో ఈ చెరువు ప‌నులు పూర్తి చేస్తామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ తెలిపారు. సుమారు 150 ఎకరాల మేర ఆక్రమణలు జరిగినట్లు అంచ‌నా వేస్తున్నామ‌ని.. రెవెన్యూ, ఇరిగేష‌న్ శాఖ‌ల‌తో క‌లిసి ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించి చెరువును అభివృద్ధి చేస్తామ‌న్నారు. ఎవ‌రివైనా ప‌ట్టా భూములుంటే.. చ‌ట్ట ప్ర‌కారం వారికి టీడీఆర్ వ‌స్తుంద‌ని తెలిపారు.

దాదాపు 47 కిలోమీట‌ర్ల నుంచి ఈ చెరువుకు వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరేద‌ని.. 2000 సంవత్సరంలో క‌ట్ట కొట్టుకుపోవాల్సినంత వ‌ర‌ద వ‌చ్చి చేరింద‌ని అన్నారు. అందుకే ఈ చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే చాలా వ‌ర‌కూ తాగునీటి స‌మ‌స్య‌లు కూడా ప‌రిష్కార‌మౌతాయ‌న్నారు. చెరువు స‌హ‌జ‌ల‌క్ష‌ణాల‌న్నీ మ‌ళ్లీ స‌మ‌కూరుస్తామ‌ని.. ఇన్‌లెట్లు, ఔట్‌లెట్ల‌ను అభివృద్ధి చేస్తామ‌న్నారు.

దాదాపు 10 అడుగుల మేర పారిశ్రామిక వ్య‌ర్థాలు, పూడిక చేరింద‌ని.. పూర్తి స్థాయిలో తొల‌గించి చెరువులో మంచి నీరు ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. మురుగు, పారిశ్రామిక వ్య‌ర్థాలు చెరువులో క‌ల‌వ‌కుండా.. కాలువ‌ల‌ను డైవ‌ర్ట్ చేయ‌డంతో పాటు.. వేస‌విలో కూడా నీరు పుష్క‌లంగా ఉండేలా ఎస్‌టీపీ(సీవ‌రేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌)ల‌ను పెట్టి వాటి ద్వారా నీరు చేరేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ఇలా తొలిద‌శ ప‌నుల‌ను రూ. 75 కోట్ల‌తో చేప‌డుతున్న‌ట్టు తెలిపారు.

జీడిమెట్లలోని ఫాక్స్ సాగర్ చెరువు చ‌రిత్ర ఎంతో ఘ‌నం.. నాటి నిజాం పాలకుల దూరదృష్టికి, ఇంజినీరింగ్‌ నైపుణ్యానికి ప్రతీకగా నిలిచిన ఈ చెరువును 1897లో ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్‌ పాలనాకాలంలో నిర్మించారు. అప్పట్లో సికింద్రాబాద్‌ ప్రాంతంలో అతిపెద్ద నీటి వనరుల్లో ఇది ఒకటిగా ఉండేది. ఒకప్పుడు ఈ చెరువు నుంచి నీటిని పంపింగ్‌ చేసి పైపుల ద్వారా ప్రజలకు సరఫరా చేసేవారు.

ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ వంటి ప్రధాన జలాశయాలు నిర్మించకముందే ఫాక్స్ సాగర్‌ నగర నీటి అవసరాలకు సేవలందించడం విశేషం. ఈ చెరువు కట్టపై నిర్మించిన పురాతన రాతి పంప్‌హౌస్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దానిపై 'Fox Sagar 1897' అని చెక్కి ఉండటం ఆనాటి చరిత్రకు ప్రత్యక్ష ఆధారంగా ఉంది. ఫాక్స్ సాగర్‌ కేవలం నీటి నిల్వ కేంద్రం మాత్రమే కాదు.

జీవవైవిధ్యానికి కూడా ముఖ్యమైన ప్రాంతం. బుల్బుల్‌, కింగ్‌ఫిషర్‌, కొంగలు, వీవర్‌ పక్షులు, ఇతర స్థానిక, వలస పక్షులకు ఈ చెరువు ఆవాసంగా నిలుస్తోంది. చెరువులో చేపల వేట ద్వారా స్థానిక మత్స్యకారులకు జీవనోపాధి లభిస్తోంది. వర్షపు నీటిని నిల్వ చేయడం, భూగర్భ జలాలను పెంపొందించడం, పరిసర ప్రాంతాల పర్యావరణ సమతుల్యతను కాపాడటంలోనూ ఈ జలాశయం కీలక పాత్ర పోషిస్తోంది.ఇంత‌టి ప్రాధాన్య‌త‌తో పాటు చారిత్ర‌క నేప‌థ్యం ఉన్న ఈ చెరువును పున‌రుద్ధ‌రించి.. భావిత‌రాల‌కు భ‌ద్రంగా అందించాల‌ని హైడ్రా నిర్ణ‌యించింది.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR