Hyderabad: పౌల్ట్రీ రంగ అభివృద్ధికి ప్రభుత్వ సంపూర్ణ సహకారం: వాకిటి శ్రీహరి!
Hyderabad: పౌల్ట్రీ రంగ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని, సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.
Hyderabad: పౌల్ట్రీ రంగ అభివృద్ధికి ప్రభుత్వ సంపూర్ణ సహకారం: వాకిటి శ్రీహరి!
హైదరాబాద్: హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో నిర్వహించిన 18వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో–2026 నాలెడ్జ్ డే కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ, విదేశాల నుంచి వచ్చిన పౌల్ట్రీ రంగ పారిశ్రామికవేత్తలకు, నిపుణులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున స్వాగతం పలికారు.
తెలంగాణలో పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను సింగిల్ విండో విధానంలో యుద్ధప్రాతిపదికన మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పానికి అనుగుణంగా పౌల్ట్రీ రంగంలో మహిళలకు అవకాశాలు కల్పించాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. మహిళలు ఇతరులపై ఆధారపడే స్థాయి నుంచి ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.
పౌల్ట్రీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తామని తెలిపారు. సంబంధిత శాఖల కార్యదర్శులు, పౌల్ట్రీ రంగ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, ప్రభుత్వ పరిధిలోని సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రస్తుతం పౌల్ట్రీ రంగంలో దేశంలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణను రాబోయే రోజుల్లో మొదటి స్థానంలో నిలపాలన్నదే తన ఆకాంక్ష అని మంత్రి పేర్కొన్నారు. వచ్చే పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో నాటికి తెలంగాణ అగ్రస్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
తనకు కూడా పౌల్ట్రీ రైతుగా మారాలనే ఆకాంక్ష ఎన్నో సంవత్సరాలుగా ఉందని మంత్రి తెలిపారు. ఈ వేదికగా అచ్యుత్ రామ్‌ను పౌల్ట్రీ రంగంలోకి ప్రోత్సహిస్తున్నట్లు ప్రకటించారు. పౌల్ట్రీ రంగ ప్రముఖులు ఆయనకు అవసరమైన మార్గదర్శకత్వం, సహకారం అందించాలని కోరారు.
పౌల్ట్రీ పరిశ్రమ అంతగా విస్తరించని ప్రాంతాల్లో మహిళలను సంఘటితం చేసి, వారికి ఉపాధి, ఆదాయ అవకాశాలు కల్పించే దిశగా కృషి చేయాలని సూచించారు.
తెలంగాణలో పౌల్ట్రీ రంగ విస్తరణకు, నూతన పెట్టుబడులకు, మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి పునరుద్ఘాటించారు.
కార్యక్రమ నిర్వాహకులకు, పౌల్ట్రీ రంగ ప్రముఖులకు, దేశ విదేశాల నుంచి హాజరైన ప్రతినిధులకు మంత్రి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.




