Hyderabad: ఫ్యూచర్ సిటీ రూపకల్పనపై మేధావుల కీలక సూచనలు!
Hyderabad: హైదరాబాద్‌లో టీఆర్‌ఎల్‌డీ ఆధ్వర్యంలో 'ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్' రౌండ్ టేబుల్ సమావేశం.
Hyderabad: ఫ్యూచర్ సిటీ రూపకల్పనపై మేధావుల కీలక సూచనలు!
హైదరాబాద్: ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై ప్రజలు, మేధావులు, రాజకీయ పార్టీల నుంచి వచ్చే అనుకూల, ప్రతికూల అభిప్రాయాలన్నింటినీ ప్రభుత్వం సమానంగా స్వాగతిస్తుందని తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ మహ్మద్ రియాజ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర లోక్ దళ్ (టీఆర్‌ఎల్‌డీ) ఆధ్వర్యంలో హైదరాబాద్ లక్షీకాపూల్‌లోని హోటల్ సెంట్రల్ కోర్ట్‌లో నిర్వహించిన "ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్" రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఫ్యూచర్ సిటీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా ఉందని పేర్కొన్న రియాజ్, హైదరాబాద్ నగర విస్తరణ, అభివృద్ధికి అత్యధిక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. స్వయం సమృద్ధి, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలతో ఫ్యూచర్ సిటీని నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సమావేశంలో వచ్చిన విలువైన సూచనలు, అభిప్రాయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ, ఫ్యూచర్ సిటీ స్వయం సమృద్ధి, సమ్మిళిత అభివృద్ధికి ప్రతీకగా నిలవాలని అన్నారు. సేవారంగానికి తగిన అవకాశాలు, అందుబాటు గృహవసతి కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో, ఇటలీలోని రోమ్ నగరాలతో పాటు దేశంలోని ప్రణాళికాబద్ధ నగరమైన చండీగఢ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.
మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ మాట్లాడుతూ, ఫ్యూచర్ సిటీ రూపకల్పనపై మేధావులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రముఖ పౌరుల అభిప్రాయాలను సేకరించడమే ఈ రౌండ్ టేబుల్ సమావేశం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. సమావేశంలో వచ్చిన సూచనలు, సిఫార్సులను సమగ్ర నివేదిక రూపంలో రూపొందించి ప్రభుత్వం, సంబంధిత అధికారులకు త్వరలో అందజేస్తామని వెల్లడించారు.




