OU: పేదల పక్షపాతి 'గుడిసెల వెంకటస్వామి': నామ సైదులు కొనియాడారు!

OU: ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల వేదికగా దివంగత కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి (కాక) 97వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

HARISH, TARNAKA
Published on: 5 Oct 2026 9:32 PM IST
OU
X

OU: పేదల పక్షపాతి 'గుడిసెల వెంకటస్వామి': నామ సైదులు కొనియాడారు!

ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గడ్డం వెంకటస్వామి (కాక) 97వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల వేదికగా ఆల్ మాల స్టూడెంట్ అసోసియేషన్ ఓయూ అధ్యక్షుడు నామ సైదులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా నామ సైదులు మాట్లాడుతూ.. గడ్డం వెంకటస్వామి అంబేడ్కర్‌ భావజాలాన్ని బలంగా విశ్వసించిన నాయకుడని కొనియాడారు. పేదల కోసం భూ పోరాటాలు నిర్వహించి హైదరాబాద్‌లో వేలాది మందికి ఇళ్ల స్థలాలు ఇప్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. పేదల కోసం గుడిసెలు ఏర్పాటు చేయడంతో ‘గుడిసెల వెంకటస్వామి’గా ప్రజల గుండెల్లో నిలిచిపోయారని గుర్తుచేశారు.

కాంగ్రెస్‌ పార్టీలో వివిధ పదవులు చేపట్టి, కేంద్ర మంత్రిగా సేవలందించిన వెంకటస్వామి దళిత, బహుజన, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని తెలిపారు. అంబేడ్కర్‌ పేరుతో విద్యాసంస్థలను స్థాపించి పేద విద్యార్థులకు విద్య అందించేందుకు కృషి చేశారని పేర్కొన్నారు. బలహీన వర్గాల కోసం నిరంతరం పాటుపడిన ఆయన దేశం గర్వించదగ్గ నాయకుడిగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూ రాష్ట్ర నాయకుడు కేశబోయిన మురళీయాదవ్, మాల స్టూడెంట్‌ జేఏసీ నాయకులు బత్తుల రమేశ్, బత్తుల దిలీప్, పెరమళ్ల వేణు, రజక సంఘం నాయకులు రఘు, రామకృష్ణ, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA