LB Nagar: గణేష్ సురక్ష సంకల్ప్‌లో ఆహార భద్రతపై అవగాహన సదస్సు!
LB Nagar: గణేష్ సురక్ష సంకల్ప్‌లో ఆహార భద్రతపై అవగాహన: కల్తీ ఆహారంతో ప్రజారోగ్యానికి ముప్పు, అప్రమత్తత అవసరమని నాగోల్ మట్టి వినాయకుడి వద్ద మల్కాజిగిరి సీపీ సుమతి పిలుపు.
LB Nagar: గణేష్ సురక్ష సంకల్ప్‌లో ఆహార భద్రతపై అవగాహన సదస్సు!
ఎల్బీనగర్: గణేష్ సురక్ష సంకల్ప్–2026లో భాగంగా ప్రజల్లో భద్రతా అవగాహనతో పాటు ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణం కోసం మల్కాజిగిరి పోలీసులు విభిన్న సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన 72 అడుగుల పర్యావరణహిత గణనాథుడి వద్ద ఆహార భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్టేట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ ఐఏఎస్, ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డి, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీపీ సుమతి మాట్లాడుతూ.. మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని, ఆహారంలో నాణ్యత లోపం, కల్తీ నేరుగా ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతుందని తెలిపారు.
పండుగల సమయంలో స్వీట్లు, పానీయాలు, ఇతర ఆహార పదార్థాల వినియోగం పెరుగుతుందని.. ఈ సమయంలో ప్రజలు ఆహార నాణ్యత, పరిశుభ్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కల్తీ ఆహారం, నాణ్యత లేని ముడి పదార్థాలు, అపరిశుభ్రమైన ప్రదేశాల్లో తయారీ, సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోవడం, గడువు ముగిసిన ఆహార పదార్థాల వినియోగం వంటి వాటితో ఆరోగ్యానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని వివరించారు.
ఆహార పదార్థాలను కొనుగోలు చేసేటప్పుడు తయారీ తేదీ, గడువు తేదీ, ప్యాకేజింగ్, లేబులింగ్, నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పరిశీలించాలని ప్రజలకు సూచించారు. ప్రసాదాలు, అన్నదానం, తాగునీరు వంటి వాటిలో కూడా పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలు పాటించడం నిర్వాహకుల సామాజిక బాధ్యత అని అధికారులు స్పష్టం చేశారు.
అనుమానాస్పదమైన లేదా నాణ్యత లేని ఆహార పదార్థాల వినియోగానికి ప్రజలు దూరంగా ఉండాలని సీపీ సుమతి సూచించారు.
నేరాల నియంత్రణతో పాటు మహిళల భద్రత, మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన, రోడ్డు భద్రత, ఆహార భద్రత, సైబర్ నేరాలపై ప్రజలను భాగస్వాములను చేయడమే గణేష్ సురక్ష సంకల్ప్–2026 లక్ష్యమని సీపీ తెలిపారు.
72 అడుగుల పర్యావరణహిత గణనాథుడిని సందర్శించిన జయేష్ రంజన్.. పర్యావరణహితంగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. భక్తి, ఆనందంతో పాటు ప్రజారోగ్యం, పరిశుభ్రత, సామాజిక బాధ్యతకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
కార్యక్రమంలో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతో, ఎల్బీనగర్ డీసీపీ బి. అనురాధ, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్, ఎల్బీనగర్ ఏసీపీ రవీందర్ రెడ్డి, చైతన్యపురి ఎస్‌హెచ్‌ఓ కే. సైదులు, ఎస్సైలు శివ, నాగ ప్రసాద్, మధు తదితరులు పాల్గొన్నారు.




