Ghatkesar: ఘట్‌కేసర్ అందెశ్రీ స్మృతి వనానికి సీఎం శంకుస్థాపన
Ghatkesar: ఘట్‌కేసర్‌లో రూ.3.95 కోట్లతో అందెశ్రీ స్మృతి వనానికి సీఎం శంకుస్థాపన. ఘనంగా కవి అందెశ్రీ జయంతి వేడుకలు. ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు.
Ghatkesar: ఘట్‌కేసర్ అందెశ్రీ స్మృతి వనానికి సీఎం శంకుస్థాపన
ఘట్‌కేసర్: తెలంగాణ భాషా వైభవానికి ప్రతీకగా నిలిచిన రాష్ట్ర కవి అందెశ్రీ జయంతి సందర్భంగా శనివారం ఘట్‌కేసర్‌లో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా రూ.3.95 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న అందెశ్రీ స్మృతి వనంకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో శుక్రవారం స్మృతి వనం ప్రాంగణంలో ఏర్పాట్లను మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెది సుదీర్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు బొక్క ప్రభాకర్ రెడ్డి తదితరులతో కలిసి పరిశీలించారు.
కార్యక్రమ వేదిక, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్, ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తోటకూర వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్ర కవి అందెశ్రీ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందన్నారు.
ముఖ్యమంత్రి పాల్గొనే ఈ కార్యక్రమానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, కవులు, సాహితీవేత్తలు, కళాకారులు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నట్లు తెలిపారు. రూ.3.95 కోట్లతో నిర్మించనున్న ‘అందెశ్రీ స్మృతి వనం’ తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక చరిత్రలో మరో మైలురాయిగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర కవి అందెశ్రీ సాహిత్య వారసత్వాన్ని భావితరాలకు అందించడంతో పాటు తెలంగాణ భాష, సంస్కృతి, సాహిత్య వైభవాన్ని ప్రతిబింబించే కేంద్రంగా ఈ స్మృతి వనం రూపుదిద్దుకోనుందని చెప్పారు.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, సాహిత్య సంపద, సాంస్కృతిక వారసత్వాన్ని ఒకేచోట చాటిచెప్పే ప్రత్యేక వేదికగా దీనిని అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తోటకూర వజ్రెష్ యాదవ్ పిలుపునిచ్చారు.
ఈ ఏర్పాట్ల పరిశీలనలో డీసీసీ కార్యదర్శి ముత్యాల్ యాదవ్, ఎదులాబాద్, పోచారం, చెంగిచెర్ల డివిజన్ల అధ్యక్షులు సామల అమర్, కర్రే రాజేష్, పోగుల దిలీప్ రెడ్డి, గడ్డన్నారం ఫ్రూట్స్ మార్కెట్ డైరెక్టర్ మచెందర్ రెడ్డి, సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.




