Ghatkesar: ఉద్యోగం పేరుతో మహిళపై అత్యాచారం, మున్సిపల్ మేనేజర్ అరెస్ట్, రిమాండ్ కి తరలింపు!

Ghatkesar: మున్సిపాలిటీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మహిళ నుంచి రూ.4.5 లక్షలు వసూలు చేసి అత్యాచారానికి పాల్పడిన ఆలేరు శానిటేషన్ మేనేజర్ జగన్మోహన్‌ను ఘట్‌కేసర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

KARUNAKAR, UPPAL
Updated on: 27 Oct 2026 11:31 PM IST
Ghatkesar
X

Ghatkesar: ఉద్యోగం పేరుతో మహిళపై అత్యాచారం, మున్సిపల్ మేనేజర్ అరెస్ట్, రిమాండ్ కి తరలింపు!

ఘట్‌కేసర్‌: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ మహిళ నుంచి రూ.4.5 లక్షలు వసూలు చేయడంతోపాటు, ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదుపై ఘట్‌కేసర్‌ పోలీసులు ఆలేరు మున్సిపాలిటీ శానిటేషన్‌ మేనేజర్‌ బుగ్గ జగన్మోహన్‌ (54)ను అరెస్టు చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

ఘట్‌కేసర్‌ ఇన్‌స్పెక్టర్‌ కిరణ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరికి చెందిన జగన్మోహన్‌కు సుమారు నాలుగు నెలల క్రితం మల్లాపూర్‌లోని బ్రహ్మపుత్ర కాలనీకి చెందిన 30 ఏళ్ల మహిళతో ఫోన్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. తాను భువనగిరి మున్సిపాలిటీలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నానని, అక్కడ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఇందుకోసం రూ.5 లక్షలు అవసరమని చెప్పినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

ఈ క్రమంలో అక్టోబరు 26న మల్లాపూర్‌లోని రత్నదీప్‌ సమీపంలో ఆమెను కారులో ఎక్కించుకున్న నిందితుడు.. మున్సిపల్‌ కార్యాలయానికి తీసుకెళ్తానని చెప్పి ఔషాపూర్‌లోని శ్రీనిధి రిసార్ట్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఉన్నతాధికారి ఉన్నారని, ఉద్యోగం గురించి మాట్లాడుదామని నమ్మించినట్లు బాధితురాలు తెలిపింది. మార్గమధ్యంలో రూ.4.5 లక్షలు తీసుకున్న నిందితుడు.. రిసార్ట్‌లో ఉన్నతాధికారి ఎవరూ లేకపోవడంతో తనపై దాడి చేసి బలవంతంగా అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించింది.

అనంతరం ఉన్నతాధికారిని కలవాలని కోరగా దుర్భాషలాడి, వరంగల్‌ జాతీయ రహదారిపై కారులో నుంచి కిందకు తోసేసి పరారైనట్లు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదుతో అక్టోబరు 26న కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు వాస్తవానికి ఆలేరు మున్సిపాలిటీలో శానిటేషన్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నప్పటికీ, భువనగిరి మున్సిపాలిటీలో పనిచేస్తున్నట్లు బాధితురాలిని నమ్మించినట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడు భువనగిరి వైపు కారులో వెళ్తున్నట్లు సమాచారం అందడంతో అక్టోబరు 27న యామ్నంపేట చౌరస్తా వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ కిరణ్‌ వెల్లడించారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL