Ghatkesar: ప్రభుత్వ బడికి రంగులు వేయించిన మాజీ ఎంపీటీసీకి ఘన సన్మానం

Ghatkesar: కొండాపూర్ ప్రభుత్వ పాఠశాలకు రంగులు వేయించిన మాజీ ఎంపీటీసీ నందం గణేష్ బాబు. ఘట్‌కేసర్‌లో స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన సన్మానం.

KARUNAKAR, UPPAL
Published on: 5 Nov 2026 7:23 PM IST
Ghatkesar
X

Ghatkesar: ప్రభుత్వ బడికి రంగులు వేయించిన మాజీ ఎంపీటీసీకి ఘన సన్మానం

ఘట్‌కేసర్‌: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి ప్రభుత్వానికే పరిమితం కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని మాజీ ఎంపీటీసీ నందం గణేష్‌బాబు పిలుపునిచ్చారు. ఊరి బడి మనందరిదనే భావనతో దాని అభివృద్ధికి ప్రతి పౌరుడు తనవంతు చేయూత అందించాలని అన్నారు. స్ఫూర్తి ఆర్గనైజేషన్‌ చేపట్టిన 'మన బడులు.. మన బాధ్యత' కార్యక్రమంలో భాగంగా మల్కాజిగిరి నగరపాలక సంస్థ ఘట్‌కేసర్‌ డివిజన్‌ పరిధిలోని కొండాపూర్‌ ప్రాథమిక పాఠశాలకు పూర్తి స్థాయిలో రంగులు నందం గణేష్‌బాబు వేయించారు.

ఈ నేపథ్యంలో గురువారం గ్రామ పెద్దలు, నాయకులు, ఆర్గనైజేషన్‌ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆయనను ఘనంగా సన్మానించారు. భారత రాజ్యాంగ పుస్తకాన్ని బహూకరించి అభినందించారు. ఈ సందర్భంగా గణేష్‌బాబు మాట్లాడుతూ.. రాజ్యాంగం పౌరులకు హక్కులతో పాటు బాధ్యతలను కూడా కల్పించిందని, వాటిలో సామాజిక బాధ్యత కీలకమని పేర్కొన్నారు.

ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు స్ఫూర్తి ఆర్గనైజేషన్‌ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. దాతల సహకారంతో పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు చేపడుతున్న ప్రయత్నాలు మరింత మందికి స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.

స్ఫూర్తి ఆర్గనైజేషన్‌ అధ్యక్షుడు కుంటోళ్ల యాదయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను సమాజ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయడమే తమ సంస్థ లక్ష్యమన్నారు. కేవలం పాఠశాలలకు రంగులు వేయించడమే కాకుండా విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, శాస్త్రీయ దృక్పథం, విద్యా నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో కనీసం ఒక ప్రభుత్వ పాఠశాలనైనా ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు దాతలు, యువత, విద్యావంతులు ముందుకు రావాలని కోరారు.

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు ముల్లి జంగయ్య యాదవ్‌ మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలే విద్యకు ప్రధాన ఆధారమన్నారు. వాటిలో మెరుగైన వసతులు కల్పించి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటుకు గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు, దాతలు సహకరించాలని కోరారు.

మాజీ సర్పంచ్‌ డక్కి రమేష్‌, ఆర్గనైజేషన్‌ ఉపాధ్యక్షుడు మేకల పద్మారావు మాట్లాడుతూ.. ఒక బడికి రంగులు వేయించడం మంచి పనైతే.. ఆ బడిని మనదిగా భావించి నిరంతరం అభివృద్ధికి తోడ్పడటం గొప్ప సామాజిక బాధ్యతని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కొంతం లక్ష్మారెడ్డి, మందడి శ్రీనివాస్‌రెడ్డి, మొలుగురం గణేష్‌, బొంత సుధాకర్‌, కొమ్మిడి శివకృష్ణారెడ్డి, ముత్యం రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు ఆర్‌. దాసు, ఉపాధ్యాయులు లక్ష్మీ కల్పన, శివకుమార్‌, ఆర్గనైజేషన్‌ సభ్యులు కే. రాజేందర్‌రెడ్డి, రాజు, చెన్నయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL