Ghatkesar: ఘట్‌కేసర్‌లో ఎక్సైజ్ దాడులు.. భారీగా గోవా మద్యం సీజ్!

Ghatkesar: ఘట్‌కేసర్ పరిధిలోని జవహర్‌నగర్‌లో ఎక్సైజ్ అధికారులు అక్రమ మద్యం నిల్వలపై ఉక్కుపాదం మోపారు.

KARUNAKAR, UPPAL
Published on: 18 Jun 2026 8:00 PM IST
Ghatkesar
X

Ghatkesar: ఘట్‌కేసర్‌లో ఎక్సైజ్ దాడులు.. భారీగా గోవా మద్యం సీజ్!

ఘట్‌ కేసర్: అక్రమ మద్యం నిల్వలు, విక్రయాలపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపింది. డైరెక్టర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా జవహర్‌నగర్ పరిసర ప్రాంతాల్లో మల్కాజిగిరి డిటిఎఫ్, కాప్రా ఎక్సైజ్ బృందాలు సంయుక్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించాయి. ఈ దాడుల్లో భారీ మొత్తంలో గోవా మద్యం, విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు.

బాలాజీనగర్‌లోని వెంకటేశ్వర కాలనీలో నివాసముంటున్న రెడ్డిశెట్టి మహేష్ ఇంటిపై నిర్వహించిన దాడిలో వివిధ బ్రాండ్లకు చెందిన 59 గోవా మద్యం, విదేశీ మద్యం సీసాలు లభించాయి. వీటి పరిమాణం 51.55 లీటర్లు. అలాగే మోహన్‌రావు కాలనీలోని రెడ్డిశెట్టి శ్రీనివాస్ నివాసంలో తనిఖీలు చేపట్టగా 112 గోవా మద్యం, విదేశీ మద్యం సీసాలు స్వాధీనం అయ్యాయి. వీటి పరిమాణం 75.75 లీటర్లు.

అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో విక్రయానికి మాత్రమే అనుమతించబడిన వివిధ బ్రాండ్లకు చెందిన 251 డ్యూటీ పేడ్ విస్కీ సీసాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి పరిమాణం 129.66 లీటర్లు. మొత్తం రెండు కేసుల్లో కలిపి 422 మద్యం సీసాలు, 256.96 లీటర్ల మద్యం పట్టుబడినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.

అక్రమంగా మద్యం నిల్వ చేసి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులపై సంబంధిత ఎక్సైజ్ చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ జూపల్లి రవి తెలిపారు. అనంతరం నిందితులను బీఎన్‌ఎస్‌ఎస్-2023 సెక్షన్ 35(3) ప్రకారం బెయిల్‌పై విడుదల చేసినట్లు చెప్పారు. అక్రమ మద్యం రవాణా, నిల్వలు, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story