Edulabad: ఫామ్‌హౌస్‌లో రిటైర్డ్ ఎస్‌ఐ కొడుకు అనుమానాస్పద మృతి!

Edulabad: ఘట్‌కేసర్‌ సమీపంలోని ఏదులాబాద్‌ ఫామ్‌హౌస్‌లో రిటైర్డ్ ఎస్‌ఐ కుమారుడు కృష్ణ కౌండిన్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

KARUNAKAR, UPPAL
Updated on: 26 Oct 2026 1:11 AM IST
Edulabad
X

Edulabad: ఫామ్‌హౌస్‌లో రిటైర్డ్ ఎస్‌ఐ కొడుకు అనుమానాస్పద మృతి!

ఏదులాబాద్‌: స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మల్కాజిగిరి పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి ఏదులాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కుమారుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

ఉప్పల్‌ భగాయత్‌లో నివాసం ఉంటున్న రిటైర్డ్‌ పోలీస్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ సి. ప్రవీణ్‌ కుమార్‌ (61) కుమారుడు కృష్ణ కౌండిన్య (21) నారాయణగూడలోని కేశవ మెమోరియల్‌ కళాశాలలో బీటెక్‌ పూర్తి చేశాడు.

ఈ నెల 24న సాయంత్రం 7.30 గంటల సమయంలో తన స్నేహితుడు ఘన్‌కోట్‌ రిషబ్‌తో కలిసి ఏదులాబాద్‌లోని లివిన్‌ ఫామ్‌హౌస్‌లో నిర్వహిస్తున్న మరో స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం 10 గంటల సమయంలో రిషబ్‌ తండ్రి ప్రవీణ్‌ కుమార్‌కు ఫోన్‌ చేసి.. కృష్ణ కౌండిన్య ఫామ్‌హౌస్‌లో అపస్మారక స్థితిలో పడిపోయాడని, అతడిని ఘట్‌కేసర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకోగా, అప్పటికే కృష్ణ కౌండిన్య మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని ప్రవీణ్‌ కుమార్‌ అక్టోబర్‌ 25న మధ్యాహ్నం 1 గంటకు ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, యువకుడి మృతికి గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL