Ghatkesar: ఎదులాబాద్‌లో ఉచిత మెగా వైద్య శిబిరం జయప్రదం
Ghatkesar: ఘట్‌కేసర్ ఎదులాబాద్‌లో మెడిసిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసిన వైద్య బృందం.
Ghatkesar: ఎదులాబాద్‌లో ఉచిత మెగా వైద్య శిబిరం జయప్రదం
ఘట్‌కేసర్: ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా మల్కాజిగిరి నగరపాలక సంస్థ ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ లో మంగళవారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, జిల్లా మీడియా కన్వీనర్ చలువాది ప్రవీణ్ రావు సహకారంతో మెడిసిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన శిబిరంలో వందలాది మంది గ్రామస్తులు ఉచిత వైద్య సేవలను పొందారు.
శిబిరంలో బీపీ, షుగర్, కంటి, ఈఎన్‌టీ, గైనకాలజీ, ఆర్థో తదితర విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు శస్త్రచికిత్సలు అవసరమైన వారికి ప్రత్యేక వైద్య సలహాలు, చికిత్స సౌకర్యం కల్పిస్తామని వైద్య బృందం తెలిపింది.
ఈ సందర్భంగా ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఎదులాబాద్ పరిసర ప్రాంతాల్లో త్రాగునీటి నాణ్యత క్షీణించడం, వాయు కాలుష్యం, వ్యవసాయంలో విచ్చలవిడిగా రసాయనాల వినియోగం, కలుషిత ఆహార పదార్థాల వినియోగం వంటి కారణాలతో కిడ్నీ సంబంధిత వ్యాధులు, సంతానలేమి, ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
వ్యాధి తీవ్రరూపం దాల్చిన తర్వాత చికిత్స పొందడం కంటే, ముందస్తుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడమే ఉత్తమ రక్షణ అని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి కుటుంబం క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు.
శిబిరాన్ని మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోనే శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగం అర్జున్ సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శక్తికేంద్రం ఇన్‌చార్జి రాజేష్, రాచకట్ల శ్రీశైలం, మల్లేష్ ముదిరాజ్, నాగరాజు, ప్రసాద్, వైద్యులు, మెడికల్ సిబ్బంది, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, మహిళలు, యువతతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని ఉచిత వైద్య సేవలను వినియోగించుకున్నారు.




