Ghatkesar: పెళ్లికి నిరాకరించిన ప్రియుడు.. ఎంబీఏ యువతి ఆత్మహత్య!

Ghatkesar: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి వివాహానికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన ఎంబీఏ యువతి ఘట్‌కేసర్‌లో ఆత్మహత్య చేసుకుంది. తండ్రి ఫిర్యాదుతో ప్రియుడిపై కేసు నమోదైంది.

KARUNAKAR, UPPAL
Updated on: 20 Nov 2026 7:23 AM IST
Ghatkesar
X

Ghatkesar: పెళ్లికి నిరాకరించిన ప్రియుడు.. ఎంబీఏ యువతి ఆత్మహత్య!

ఘట్‌కేసర్‌: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, చివరకు వివాహానికి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రియుడిపై కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ కిరణ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్‌ ఎన్‌ఎఫ్‌సీ నగర్‌కు చెందిన దర్నబోయిన జంగయ్యకు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

కుమార్తె ఐశ్వర్య (22) ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. ఈ క్రమంలో ఉప్పల్‌ ప్రాంతానికి చెందిన జామ కిరణ్‌కుమార్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో గత ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని ఐశ్వర్య కుటుంబ సభ్యులకు తెలియజేసి, కిరణ్‌కుమార్‌ను వివాహం చేసుకోవాలనే తన అభిప్రాయాన్ని వెల్లడించింది. దీంతో ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం జరిపించాలని నిర్ణయించారు.

దీపావళికి ముందు ఐశ్వర్య కిరణ్‌కుమార్‌ ఇంటికి వెళ్లి అతడి తల్లిదండ్రులతో వివాహ విషయమై మాట్లాడింది. అయితే కిరణ్‌కుమార్‌ తల్లి పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించింది. అప్పటి నుంచి కిరణ్‌కుమార్‌ ఐశ్వర్యకు ఫోన్‌ చేయడం, సందేశాలు పంపడం మానేసి, ఆమె ఫోన్‌ నంబర్‌ను బ్లాక్‌ చేశాడు. ఈ నెల 17న ఇకపై తనకు ఫోన్‌ చేయవద్దని, తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని చేసుకోవాలని, తాను పెళ్లికి సిద్ధంగా లేనని కిరణ్‌కుమార్‌ ఐశ్వర్యకు సందేశం పంపినట్లు తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఐశ్వర్య తాను ఆత్మహత్య చేసుకుంటానని కిరణ్‌కుమార్‌కు సందేశం పంపినా అతడి నుంచి స్పందన రాలేదని తండ్రి తెలిపారు. ఈ నెల 18న ఉదయం 11 గంటల సమయంలో ఇంట్లోని బెడ్‌రూమ్‌లోకి వెళ్లిన ఐశ్వర్య తలుపులు వేసుకుంది. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి శైలజ తలుపు తట్టింది. అయినా స్పందన లేకపోవడంతో సోదరుడు ఈశ్వర్‌ తలుపులు పగలగొట్టి చూడగా ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది.

వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికుల సహాయంతో ఆమెను కిందకు దించి ఘట్‌కేసర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకర ఆసుపత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ ఈ నెల 19న ఉదయం 8.59 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తన కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, చివరకు వివాహానికి నిరాకరించి మానసిక వేదనకు గురిచేసిన కిరణ్‌కుమార్‌ కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని తండ్రి ఫిర్యాదు చేశారు. దీంతో ఘట్‌కేసర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL