Ghatkesar: చోరీ కేసును చాకచక్యంగా ఛేదించిన ఘట్కేసర్ పోలీసులు.. 10 మంది అరెస్ట్!
Ghatkesar: కొండాపూర్ వైష్ణవి రెసిడెన్సీలో జరిగిన చోరీ కేసును ఛేదించిన ఘట్కేసర్ పోలీసులు 10 మందిని అరెస్టు చేసి 10 తులాల బంగారం, వెండి, నగదు స్వాధీనం చేసుకున్నారు.
Ghatkesar: చోరీ కేసును చాకచక్యంగా ఛేదించిన ఘట్కేసర్ పోలీసులు.. 10 మంది అరెస్ట్!
ఘట్కేసర్: తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి చోరీలకు పాల్పడుతున్న ముఠాను ఘట్కేసర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కొండాపూర్‌లోని వైష్ణవి రెసిడెన్సీలో జరిగిన చోరీ కేసును ఛేదించి పది మందిని అరెస్టు చేయగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొండాపూర్ వైష్ణవి రెసిడెన్సీలో నివాసముండే నవీన్‌కుమార్ నవంబరు 14న కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి బోడుప్పల్‌లోని స్నేహితుడి ఇంటికి వెళ్లాడు.
నవంబరు 18న తిరిగి వచ్చి చూడగా ఇంటి కిటికీ పగలగొట్టి ఉండటంతో పాటు బీరువాలోని సుమారు 18 తులాల బంగారం, వెండి ఆభరణాలు, నగదు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి నవంబరు 24న యంనంపేట్ ఎక్స్ రోడ్డు వద్ద పది మందిని అరెస్టు చేశారు.
అరెస్టయిన వారిలో కె.సామేల్ అలియాస్ నాని (19), పిట్టల ఉమర్ అలియాస్ షేక్ ఉమర్ (18), షేక్ సద్దాం షరీఫ్ (21), పిట్టల పాపిత (33), మార్కల సాయికుమార్ (21), ఎస్డీ.సిద్ధిఖ్ (22), నోకటాల మోతీలాల్ (29), నోకటాల శబ్బు (24), శక్తి విశాల్ (24), గణసాల రైలన్ మాక్స్ (20) ఉన్నారు. మరో నిందితుడు మానుసాల వెంకటేశ్ (24) పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
నిందితుల నుంచి 10 తులాల బంగారు ఆభరణాలు, 24 తులాల వెండి వస్తువులు, రెండు ఐఫోన్లు, రూ.53 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటిలో బంగారు నెక్లెస్, బుట్ట కమ్మలు, చంద్రహారం, జడపువ్వు, గొలుసులు, ఉంగరాలు ఉన్నాయి. ముఠాలో ఏ-1 సామేల్, ఏ-2 ఉమర్ ప్రధాన నిందితులుగా వ్యవహరిస్తూ చోరీలకు పాల్పడేవారని, అపహరించిన నగలను మిగిలిన నిందితుల ద్వారా విక్రయించేవారని పోలీసులు వెల్లడించారు.
వీరిద్దరిపై గతంలోనూ ఆస్తి సంబంధిత నేరాలున్నాయని, ఘట్కేసర్ రైల్వే స్టేషన్ వద్ద కదులుతున్న రైళ్లలో ప్రయాణికుల మొబైల్ ఫోన్ల చోరీ కేసుల్లోనూ సంబంధం ఉన్నట్లు గుర్తించారు. మరో నిందితుడు సద్దాం గతంలో పోక్సో కేసులో శిక్ష అనుభవించి వచ్చినట్లు తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని, కిటికీలు, తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించి విలువైన వస్తువులను అపహరించేవారని ఇన్స్పెక్టర్ కిరణ్ తెలిపారు.




