Ghatkesar: ఘట్‌కేసర్‌లో అక్రమ గోరవాణా గుట్టురట్టు.. 15 దూడలు విముక్తి!
Ghatkesar: ఘట్‌కేసర్ పరిధిలోని యామ్నంపేట్ ఎక్స్‌రోడ్డు వద్ద పోలీసులు జరిపిన తనిఖీల్లో అక్రమ గోరవాణా ముఠా గుట్టు రట్టయింది.
Ghatkesar: ఘట్‌కేసర్‌లో అక్రమ గోరవాణా గుట్టురట్టు.. 15 దూడలు విముక్తి!
ఘట్ కేసర్: అక్రమంగా కసాయిఖానాకు తరలిస్తున్న 15 గోవుల దూడలను ఘట్ కేసర్ పోలీసులు రక్షించి, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. యామ్నంపేట్ ఎక్స్‌రోడ్డు వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం, బుధవారం వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న అశోక్ లేలాండ్ గూడ్స్ వాహనాన్ని అనుమానం రావడంతో పోలీసులు తనిఖీ చేశారు.
వాహనంలో 15 గోవుల దూడలను ఎలాంటి గాలి, నీటి సదుపాయం లేకుండా అత్యంత క్రూరంగా తాడులతో కట్టి, ప్లాస్టిక్ తార్పాలిన్‌తో పూర్తిగా కప్పి తరలిస్తున్నట్లు గుర్తించారు. వీటిలో 13 మగ దూడలు, 2 ఆడ దూడలు ఉన్నాయి. వాహనంలో ప్రయాణిస్తున్న డ్రైవర్ వైబోయిన శ్రీనివాసరావు, హెల్పర్ చందక కాశిబాబును అదుపులోకి తీసుకుని విచారించగా, బహదూర్‌పురాకు చెందిన పశువుల వ్యాపారి ఇసాక్ ఆదేశాల మేరకు తుని పశువుల మార్కెట్ నుంచి ఈ దూడలను బహదూర్‌పురాలోని కసాయిఖానాకు తరలిస్తున్నట్లు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో 15 గోవుల దూడలతో పాటు రవాణాకు ఉపయోగించిన అశోక్ లేలాండ్ వాహనం (AP39WP9110)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై తెలంగాణ గోవధ నిషేధ చట్టం-1977, జంతు హింస నివారణ చట్టం-1960 కింద ఘట్ కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల సమయస్ఫూర్తితో మూగజీవాలు కసాయిఖానాకు చేరకముందే రక్షించబడ్డాయి. అనంతరం వాటిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. చట్టవిరుద్ధంగా పశువుల రవాణా, జంతువుల పట్ల క్రూరత్వానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.




