Ghatkesar: డిసెంబరులోగా ఘట్‌కేసర్‌ ఫ్లైఓవర్‌ పూర్తి చేయాలి!

Ghatkesar: 18 ఏళ్లుగా కొనసాగుతున్న ఘట్‌కేసర్‌ రైల్వే ఫ్లైఓవర్‌ను డిసెంబరు 2026లోగా పూర్తి చేయాలని కోరుతూ మేడ్చల్‌ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి వజ్రేష్‌ యాదవ్‌కు నేతలు వినతిపత్రం ఇచ్చారు.

KARUNAKAR, UPPAL
Published on: 27 Oct 2026 4:58 PM IST
Ghatkesar
X

Ghatkesar: డిసెంబరులోగా ఘట్‌కేసర్‌ ఫ్లైఓవర్‌ పూర్తి చేయాలి!

ఘట్‌కేసర్‌: 18 ఏళ్లుగా కొనసాగుతున్న ఘట్‌కేసర్‌ రైల్వే ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులను డిసెంబరు 2026లోగా పూర్తి చేయించాలని కోరుతూ స్థానిక నాయకులు మేడ్చల్‌–మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు, మేడ్చల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి తోటకూర వజ్రేష్‌ యాదవ్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఘట్‌కేసర్‌ మాజీ చైర్‌పర్సన్‌ ముల్లిపావని జంగయ్య యాదవ్‌, మాజీ ఎంపీటీసీ నందం గణేష్‌, గడ్డి అన్నారం మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ మచ్చందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు వజ్రేష్‌ యాదవ్‌ను కలిసి ఫ్లైఓవర్‌ పనుల్లో జాప్యాన్ని వివరించారు. నిర్మాణ పనులు ఏళ్ల తరబడి కొనసాగుతుండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

కాంట్రాక్టర్‌ సత్తిరెడ్డి డిసెంబరు 2026లోగా పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు రెండు స్లాబుల నిర్మాణం పూర్తయిందని, మరో స్లాబుతోపాటు ఇతర పనులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. సుమారు రూ.4 కోట్ల నిధులు చెల్లించినప్పటికీ పనులు నెమ్మదిగా సాగుతున్నాయని, నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

గడువులోగా పనులు పూర్తి కాకపోతే ప్రజలతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. వినతిపై స్పందించిన తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ ఈ నెల 29న (గురువారం) మధ్యాహ్నం ఫ్లైఓవర్‌ నిర్మాణ ప్రాంతాన్ని స్వయంగా సందర్శించి, కాంట్రాక్టర్‌ సత్తిరెడ్డితో మాట్లాడి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. డిసెంబరు 2026లోగా ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని పూర్తి చేయిస్తానని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కొండాపూర్‌ మాజీ సర్పంచ్‌ డక్కీ రమేష్‌, డీసీసీ కార్యదర్శి ఉల్లి ఆంజనేయులు, మాజీ వార్డు సభ్యుడు సల్లూరి నర్సింగరావు, డివిజన్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి మహమ్మద్‌ అబ్దుల్‌ ఖయ్యూం, ముల్గారం రాము, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంజీవరెడ్డి, మైనార్టీ నాయకుడు ఫారుక్‌, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు తోక మల్లేష్‌, యూత్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రఫీక్‌తోపాటు పలువురు నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL