Ghatkesar: ఘట్‌కేసర్‌లో ఓటరు జాబితా సవరణ డీసీ వాణి క్షేత్రస్థాయి తనిఖీ

Ghatkesar: ఘట్‌కేసర్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)-2026 వేగంగా సాగుతోంది. డిప్యూటీ కమిషనర్ వాణి స్వయంగా బూత్‌లను సందర్శించి ఇంటింటి సర్వేను పరిశీలించారు.

KARUNAKAR, UPPAL
Published on: 25 Jun 2026 7:49 PM IST
Ghatkesar
X

Ghatkesar: ఘట్‌కేసర్‌లో ఓటరు జాబితా సవరణ డీసీ వాణి క్షేత్రస్థాయి తనిఖీ

ఘట్‌ కేసర్: ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఓటరు జాబితాలు తప్పులులేకుండా, పూర్తి పారదర్శకంగా ఉండాలనే లక్ష్యంతో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)-2026 కార్యక్రమం ఘట్‌కేసర్‌లో వేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ కమిషనర్ వాణి స్వయంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఓటరు జాబితాల సవరణ, ధృవీకరణ ప్రక్రియను నిశితంగా పరిశీలించారు.

ఘట్‌కేసర్ సర్కిల్-06 పరిధిలోని ఘట్‌కేసర్ వార్డులో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు వెంకటేశం, వేణుగోపాల్, పర్యవేక్షక అధికారులు, బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు), బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు)తో కలిసి పలు బూత్‌లను సందర్శించిన డీసీ వాణి, ఇంటింటి సర్వే పనుల పురోగతిని సమీక్షించారు.

ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అధికారిక సామగ్రి పంపిణీని పరిశీలించడంతో పాటు, ఓటర్ల జాబితా ఖచ్చితత్వాన్ని నిర్ధారించేందుకు నిర్వహిస్తున్న డోర్ టు డోర్ వెరిఫికేషన్‌ను ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. స్థానిక నివాసితులతో ముచ్చటించిన ఆమె, వారి వివరాలు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదయ్యాయా లేదా అన్న అంశాలను తెలుసుకున్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా, మరణించిన వారు లేదా ఇతర ప్రాంతాలకు మారిన వారి పేర్లను గుర్తించి తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా డీసీ వాణి మాట్లాడుతూ, "ఓటరు జాబితాలో ప్రతి పేరు ప్రజాస్వామ్యానికి ప్రతిబింబం. అందువల్ల జాబితాల తయారీలో నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారులు పని చేయాలి" అని స్పష్టం చేశారు. ప్రజలు కూడా ఎన్నికల అధికారులకు సహకరించి తమ వివరాలను సరిచూసుకోవాలని ఆమె కోరారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story