Ghatkesar: ఔషాపూర్‌లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలు

Ghatkesar: ఘట్‌కేసర్ మండలం ఔషాపూర్‌లో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన బీజేపీ నేత ఏనుగు సుదర్శన్ రెడ్డి.

KARUNAKAR, UPPAL
Published on: 27 July 2026 11:27 PM IST
Ghatkesar
X

Ghatkesar: ఔషాపూర్‌లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలు

ఘట్‌కేసర్: భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న, 'మిసైల్ మ్యాన్' డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా మల్కాజిగిరి నగరపాలక సంస్థ ఏదులాబాద్ డివిజన్ ఔషాపూర్‌ లో ఆయన విగ్రహానికి మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతదేశాన్ని ప్రపంచ దేశాల సరసన నిలబెట్టిన మహోన్నత శాస్త్రవేత్తగా, ప్రజల హృదయాలను గెలుచుకున్న ఆదర్శ రాష్ట్రపతిగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.

శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా, గురువుగా ఆయన దేశానికి అందించిన సేవలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. యువత పెద్ద కలలు కనాలని, వాటిని సాకారం చేసుకునేందుకు నిరంతరం శ్రమించాలని కలాం ఇచ్చిన సందేశం నేటికీ ప్రతి విద్యార్థికి, ప్రతి యువకుడికి మార్గదర్శకంగా నిలుస్తోందని చెప్పారు.

కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా దేశసేవనే జీవిత లక్ష్యంగా భావించిన కలాం ఆశయాలను యువత ఆచరణలో పెట్టినప్పుడే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. డాక్టర్ కలాం చూపిన విలువలు, క్రమశిక్షణ, దేశభక్తి, సేవాతత్వాన్ని అనుసరించడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

భారత చరిత్రలో కలాం పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని, ఆయన ఆశయాలు నేటి తరానికి నిత్య స్ఫూర్తిగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఏనుగు మచ్చేందర్ రెడ్డి, బండారు పవన్ రెడ్డి, కన్నెబోయిన రాము యాదవ్, హరీష్ యాదవ్, ఏనుగు రఘురాం రెడ్డి, జీహెచ్‌ఎంసీ బీసీ సంఘం ఉపాధ్యక్షుడు, అఖిల భారత రజక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్మరాజు సతీష్ కుమార్, కాసుల వెంకటేష్ గౌడ్, సాయిలు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story