Hyderabad: జూబ్లీహిల్స్‌లో బంగారు ఆభరణాల చోరీ.. నలుగురు ఉద్యోగులపై కేసు

Hyderabad: హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రముఖ ఎస్‌కేటీ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో భారీ బంగారం చోరీ వెలుగుచూసింది.

RAJESH,	WEST ZONE
Published on: 20 Jun 2026 3:28 PM IST
Hyderabad
X

Hyderabad: జూబ్లీహిల్స్‌లో బంగారు ఆభరణాల చోరీ.. నలుగురు ఉద్యోగులపై కేసు

హైదరాబాద్: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రముఖ జ్యువెలరీ షోరూంలో బంగారు ఆభరణాల చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. షోరూం యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురు ఉద్యోగులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గండిపేట రోడ్డులోని విస్లింగ్ వుడ్స్ అపార్ట్‌మెంట్‌కు చెందిన దోసపాటి కార్తీక్ (39), జూబ్లీహిల్స్‌లోని ఎస్‌కేటీ గోల్డ్ అండ్ డైమండ్స్ (మాజీ విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్) షోరూం యజమాని.

షోరూంలో స్టాక్ వెరిఫికేషన్ నిర్వహించగా, మరమ్మతుల కోసం ఉంచిన బంగారు ఆభరణాల్లో 8.2 గ్రాముల బంగారం కనిపించకుండా పోయినట్లు గుర్తించారు. అనంతరం జూన్ 10న కస్టమర్‌కు చెందిన నమూనా బంగారు గొలుసుతో పాటు మరో రెండు బంగారు వస్తువులు కూడా మాయమైనట్లు తేలింది.

సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా అనుమానాస్పద కదలికలు కనిపించడంతో ఉద్యోగులపై అనుమానం వ్యక్తమైంది. గత ఏడాది జూలై 13న కూడా 38.020 గ్రాముల బంగారు గొలుసు షోరూం నుంచి కనిపించకుండా పోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ తొలగించబడినట్లు తెలిపారు.

మొత్తం 76.385 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని, వాటి విలువ సుమారు రూ.1.52 లక్షలుగా ఉంటుందని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. షోరూం ఉద్యోగులు శివకుమార్ భూక్యా, చలపతిరావు, ప్రకాష్, గోవర్ధన్ కలిసి ఈ చోరీలకు పాల్పడి ఉంటారని అనుమానిస్తూ ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు న్యాయ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story