Hyderabad: ప్రభుత్వ ఉద్యోగి పేరుతో రూ.30 లక్షల రుణం మోసం!

Hyderabad: నా పేరుతో రూ.30 లక్షల రుణం నకిలీ పత్రాలతో మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుడ్డ సత్యనారాయణ రుణం పొందారని పంచాయతీ కార్యదర్శి ఈర్లపల్లి శ్రీనివాస్ ఆరోపణ.. పోలీసులకు ఫిర్యాదు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 2 Oct 2026 11:35 PM IST
Hyderabad
X

Hyderabad: ప్రభుత్వ ఉద్యోగి పేరుతో రూ.30 లక్షల రుణం మోసం!

హైదరాబాద్: తనకు తెలియకుండానే తన గుర్తింపు వివరాలను ఉపయోగించి బ్యాంకు రుణం తీసుకున్నారని ఆరోపిస్తూ ప్రభుత్వ ఉద్యోగి ఈర్లపల్లి శ్రీనివాస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న తనకు 2023లో రుణం కోసం దరఖాస్తు చేసిన సమయంలో ఈ విషయం తెలిసిందని తెలిపారు.

తన సిబిల్‌ నివేదికను పరిశీలించగా బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో తన పేరుతో రుణం ఉన్నట్లు గుర్తించానని శ్రీనివాస్‌ చెప్పారు. ఆ రుణాన్ని తాను తీసుకోలేదని, తనకు బ్యాంకు నుంచి ఎలాంటి రుణం మంజూరు కాలేదని తెలిపారు. ఈ విషయంపై అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు సమాచార హక్కు చట్టం ద్వారా బ్యాంకు నుంచి వివరాలు సేకరించినట్లు చెప్పారు.

పత్రాల్లో నా పేరు.. మరొకరి ఫొటో

బ్యాంకు నుంచి పొందిన పత్రాలను పరిశీలించగా.. వాటిలో తన పాన్‌ కార్డు నంబర్‌ ఉన్నప్పటికీ ఫొటో మాత్రం మరో వ్యక్తిదిగా కనిపిస్తోందని శ్రీనివాస్‌ ఆరోపించారు. తన ఓటరు గుర్తింపు కార్డు వివరాలను కూడా ఉపయోగించి పత్రాలు రూపొందించినట్లు అనుమానం వ్యక్తం చేశారు.

తన అసలు ఆధార్‌, పాన్‌, ఓటరు గుర్తింపు కార్డులను చూపిస్తూ.. బ్యాంకు రుణానికి సంబంధించిన పత్రాలతో వాటిని పోల్చి పరిశీలించాలని కోరారు. తన వివరాలతో బాచుపల్లి లోనీ బ్యాంకు ఆఫ్ ఇండియా లో బుడ్డ సత్యనారాయణ తన ప్రమేయం లేకుండానే రుణం తీసుకున్నట్లు తెలుస్తోందని చెప్పారు... పేరు నాది, ఫోటో బుడ్డ సత్యనారాయణ ది ఓటర్ కార్డు, పాన్ పై అతని పెట్టుకొని , చివరకు నా సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారు... సంతకం ఫోర్జరీ అయ్యిందా లేదా పోలీసులు తేల్చాలని డిమాండ్ చేయడం జరిగింది..

సిబిల్‌ స్కోర్‌పై ప్రభావం

రుణానికి సంబంధించిన ఫోన్‌ నంబర్‌, ఇతర గుర్తింపు వివరాలు తనవి కావని శ్రీనివాస్‌ తెలిపారు. అందువల్ల తన పేరుతో రుణం ఉన్న విషయం తనకు తెలియలేదన్నారు. తాను రుణం తీసుకోకపోయినా చెల్లింపులు జరగకపోవడంతో అది డిఫాల్ట్‌ రుణంగా నమోదై, తన సిబిల్‌ స్కోర్‌పై ప్రభావం చూపిందని ఆవేదన వ్యక్తం చేశారు.

దీంతో తాను కొత్తగా రుణం పొందేందుకు ప్రయత్నించిన సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. ఈ వ్యవహారం తనను తీవ్రంగా కలచివేసిందని, 2024 ఫిబ్రవరి 26న తాను బ్రెయిన్‌ అటాక్‌కు గురయ్యానని చెప్పారు. అయితే ఆరోగ్య సమస్యకు ఈ వ్యవహారమే కారణమని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు.

బ్యాంకు పత్రాలనే ఆధారాలుగా చూపిస్తున్న బాధితుడు

తన వద్ద ఉన్న ఆధార్‌, పాన్‌, ఓటరు గుర్తింపు కార్డులతో పాటు బ్యాంకు నుంచి అందిన పత్రాలను సాక్ష్యాధారాలుగా సమర్పిస్తున్నట్లు శ్రీనివాస్‌ తెలిపారు. సంబంధిత పత్రాలను పరిశీలించి, బ్యాంకు రికార్డులతో వివరాలను ధృవీకరించాలని కోరారు.

ఇదిలా ఉండగా, సాయంత్రం శేఖర్‌ అనే వ్యక్తి తనకు ఫోన్‌ చేసి ఈ వ్యవహారంపై పోరాటం చేస్తానని చెప్పారని శ్రీనివాస్‌ తెలిపారు. తాను ఆయనతో ఈ ఘటనపై మాట్లాడినట్లు వెల్లడించారు.

తన గుర్తింపు వివరాలను ఎలా ఉపయోగించారు? రుణం ఎలా మంజూరైంది? బ్యాంకు వద్ద సమర్పించిన పత్రాలను ఎవరు రూపొందించారు? అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు జరగాల్సి ఉందని బాధితుడు ఈర్లపల్లి శ్రీనివాస్ కోరుతున్నారు. చీటింగ్ చేసి నకిలీ పత్రాలు సృష్టించిన వ్యక్తి బుడ్డ సత్యనారాయణ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను డిమాండ్ చేశారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR