Hyderabad: చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలో కోలాహలంగా బతుకమ్మ వేడుకలు!
Hyderabad: వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో వైభవంగా బతుకమ్మ, దాండియా వేడుకలు. విద్యార్థినుల సంప్రదాయ ఫ్యాషన్ షో, వివిధ విభాగాల విజేతలకు బహుమతుల ప్రదానం.
Hyderabad: చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలో కోలాహలంగా బతుకమ్మ వేడుకలు!
Hyderabad: వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో సాంప్రదాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కోఠిలోని విశ్వవిద్యాలయ ప్రాంగణంలో బతుకమ్మ, దాండియా వేడుకలు, సంప్రదాయ వస్త్రధారణ ఫ్యాషన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ విభాగాలకు చెందిన విద్యార్థినులు, అధ్యాపకులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
బతుకమ్మ పోటీల్లో ఎన్‌ఎస్‌ఎస్ మూడో సంవత్సరం విద్యార్థినులు ప్రథమ బహుమతి సాధించగా, ఎన్‌సీసీ మొదటి సంవత్సరం విద్యార్థినులు ద్వితీయ బహుమతి, పరీక్షల విభాగం తృతీయ బహుమతి పొందాయి. జెనెటిక్స్ అండ్ బయోటెక్నాలజీ, రసాయన శాస్త్రం, గణిత శాస్త్ర విభాగాలతోపాటు హాస్టల్ బృందాలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. విజేతలకు నగదు బహుమతులు ప్రదానం చేశారు.
విద్యార్థినులు సంప్రదాయ వస్త్రధారణలో నిర్వహించిన ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాయంత్రం జరిగిన దాండియా నృత్యాలు సందడి చేశాయి. సంప్రదాయ ఆహార పదార్థాలు, మెహందీ స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ సూర్య ధనంజయ్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గడ్డం మల్లేశం, ఓఎస్డీ డాక్టర్ జి. విజయలక్ష్మి, ప్రిన్సిపాల్ డాక్టర్ లోక పావని హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాల ఇన్‌ఛార్జి డైరెక్టర్ డాక్టర్ కె.ఎస్.ఎన్. జ్యోతి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. విద్యతోపాటు కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థినుల సమగ్ర వికాసానికి దోహదపడతాయని ఈ సందర్భంగా వర్సిటీ అధికారులు పేర్కొన్నారు.




