హైదరాబాద్‌లో గ్రీన్ వాటర్ ట్యాంకర్లు.. నేటి నుంచి సరఫరా
హైదరాబాద్‌లో శుద్ధి చేసిన నీటి సరఫరా కోసం గ్రీన్ వాటర్ ట్యాంకర్లు ఆదివారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. పూర్తి వివరాలు ఇవే.
హైదరాబాద్‌లో గ్రీన్ వాటర్ ట్యాంకర్లు.. నేటి నుంచి సరఫరా
భూగర్భ జలాల సంరక్షణతో పాటు మంచినీటి వృథాను అరికట్టేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శుద్ధి చేసిన మురుగునీటిని (STP Water) తాగునీటియేతర అవసరాలకు పునర్వినియోగించేందుకు 'గ్రీన్ వాటర్ ట్యాంకర్' (Green Water Tanker) సేవలను నవంబర్ 1, ఆదివారం నుంచి అధికారికంగా ప్రారంభించనుంది.
ముందస్తు బుకింగ్స్ & ట్యాంకర్ల వివరాలు:
భవిష్యత్తులో రాబోయే ఎల్ నినో పరిస్థితులు, భూగర్భ జలాలపై పెరుగుతున్న ఒత్తిడిని తట్టుకునేందుకు వాటర్ బోర్డ్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తూ ఈ సేవలను అందిస్తోంది. ఈ కార్యక్రమం కింద 10,000, 20,000 మరియు 30,000 లీటర్ల సామర్థ్యం గల ట్యాంకర్లను ప్రత్యేకంగా నమోదు చేశారు. ట్యాంకర్ బుకింగ్ సౌకర్యం శనివారం (అక్టోబర్ 31) నుంచే ప్రారంభం కాగా, ఇప్పటివరకు 56 ట్యాంకర్లు, 9 మంది వినియోగదారులు నమోదు చేసుకున్నారు. త్వరలోనే వీరి సంఖ్యను 300–400 వరకు పెంచాలని అధికారులను హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్‌ఎస్‌బి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు.
ఎవరికి ఈ సేవలు లభిస్తాయి?
ప్రారంభ దశలో జీహెచ్‌ఎమ్‌సి, హెచ్‌ఎమ్‌డిఎ, ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ పార్కులు, రోడ్డు పక్కన పచ్చదనం పెంపొందించడానికి ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాకుండా సచివాలయం, ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డి, దుర్గం చెరువు, ఉప్పల్ స్టేడియం, ఐటీ కంపెనీలు, హైటెక్ సిటీ మరియు నిర్మాణ రంగానికి (Construction sector) కూడా ఈ శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయనున్నారు.
భద్రతా ముందస్తు చర్యలు:
ప్రతి గ్రీన్ వాటర్ ట్యాంకర్‌పై "తాగడానికి యోగ్యం కాదు - కేవలం తాగడానికి పనికిరాని అవసరాలకు మాత్రమే" అని స్పష్టంగా ప్రదర్శించాలి. నీటి నాణ్యతను నిరంతరం పరిశీలించేందుకు ఎస్‌టిపి సిజిఎం పద్మజను నోడల్ అధికారిగా నియమించారు. తొలి నాలుగు నుంచి ఐదు రోజుల పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా 24 గంటల పర్యవేక్షణ ఉంటుందని అధికారులు వెల్లడించారు.




