Hayathnagar: హయత్‌నగర్ డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయ, క్రీడా దినోత్సవ వేడుకలు

Hayathnagar: హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయ, క్రీడా దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు.

AJAY, HAYATH NAGAR
Published on: 5 Sept 2026 8:33 PM IST
Hayathnagar
X

Hayathnagar: హయత్‌నగర్ డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయ, క్రీడా దినోత్సవ వేడుకలు

హయత్‌నగర్: హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి, శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాధాన్యతను వివరించారు.

ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు శ్రీ బిల్లా ఆనంద్ రవి కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన జూనియర్ ఏషియన్, సీనియర్ ఏషియన్ క్రీడల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడంతో పాటు మలేషియా, థాయ్‌లాండ్, ఈజిప్ట్ తదితర దేశాల్లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. భారత రైల్వేస్ తరఫున కూడా ప్రాతినిధ్యం వహించి దేశానికి, రాష్ట్రానికి కీర్తి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన సౌత్ సెంట్రల్ రైల్వేలో చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు శారీరక దారుఢ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. లక్ష్యాన్ని చేరుకునే వరకు నిరంతరం కృషి చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహపడకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. క్రీడలతో పాటు జీవితంలోని ప్రతి రంగంలోనూ కష్టపడి పనిచేయడం, క్రమశిక్షణ, విధేయత, పట్టుదల విజయానికి ముఖ్యమైన లక్షణాలని తెలిపారు.

అలాగే తాను నటుడిగా కూడా పలు హిందీ, తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించిన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. శ్రీమంతుడు, కాటమరాయుడు తదితర చిత్రాల్లో నటించినట్లు తెలిపారు.

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. సౌత్‌జోన్, రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో పతకాలు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.

కళాశాల ప్రిన్సిపాల్ డా. సురేష్ బాబు పతక విజేతలను అభినందించారు. ముఖ్యంగా బీఏ గ్రూప్‌కు చెందిన రాజేష్, ఉదయ్ కిరణ్, గణేష్ జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో పుదుచ్చేరిలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో వారు విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించారు.

కాగా, ఆగస్టు 29న హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో అందుకున్న మేజర్ ధ్యాన్‌చంద్ ఎక్సలెన్స్ అవార్డు సందర్భంగా కళాశాల స్టాఫ్ క్లబ్ ఆధ్వర్యంలో ఫిజికల్ డైరెక్టర్ డా. కె. అనితను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి ఇందిర, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా. మధు, అకడమిక్ కోఆర్డినేటర్ డా. శేఖర్, కళాశాల లైబ్రేరియన్ డా. దుర్గాప్రసాద్తో పాటు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

క్రీడల్లో విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ, కళాశాలలో ఫిట్‌నెస్, క్రమశిక్షణ, టీమ్‌వర్క్, ఉత్తమ ప్రతిభకు అనుకూలమైన వాతావరణాన్ని కొనసాగించాలని కార్యక్రమంలో ఆకాంక్షించారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story