Hyderabad: టీజీ20 టోర్నీ రంగారెడ్డిపై కరీంనగర్ డైమండ్స్ ఘన విజయం

Hyderabad: హెచ్‌సీఏ టీజీ20 టోర్నీలో రంగారెడ్డి రైజర్స్‌పై 58 పరుగుల తేడాతో కరీంనగర్ డైమండ్స్ ఘన విజయం. రాహుల్ రాదేశ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు.

KARUNAKAR, UPPAL
Published on: 3 July 2026 9:28 AM IST
Hyderabad
X

Hyderabad: టీజీ20 టోర్నీ రంగారెడ్డిపై కరీంనగర్ డైమండ్స్ ఘన విజయం

హైదరాబాద్: ఉప్పల్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీనిధి యూనివర్సిటీ టీజీ20 టోర్నమెంట్‌లో EIPL & eleve కరీంనగర్ డైమండ్స్ మరోసారి తమ సత్తా చాటింది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్‌ను 58 పరుగుల తేడాతో చిత్తు చేసి వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో కరీంనగర్ డైమండ్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకగా, రంగారెడ్డి రైజర్స్ మూడో స్థానానికి పడిపోయింది.

టాస్ అనంతరం తొలుత బ్యాటింగ్ చేసిన కరీంనగర్ డైమండ్స్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడింది. తన్మయ్ అగర్వాల్ (29), సాత్విక్ రెడ్డి (24) వేగంగా పరుగులు సాధించి జట్టుకు శుభారంభం అందించారు. అనంతరం క్రీజులోకి వచ్చిన రాహుల్ రాదేశ్ మరోసారి తన క్లాస్‌ను చూపించాడు. కేవలం 37 బంతుల్లో 72 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు ఉన్నాయి.

మరోవైపు హృషీకేశ్ శర్మ కూడా 38 బంతుల్లో 60 పరుగులు చేసి రాహుల్‌కు చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 123 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పి జట్టును భారీ స్కోరు దిశగా నడిపించారు. చివర్లో చందన్ సహానీ (20), శుభమ్ శర్మ (17) మెరుపు ఇన్నింగ్స్‌తో స్కోరును 20 ఓవర్లలో 230/5కు చేర్చారు. 231 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రంగారెడ్డి రైజర్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది.

వికెట్లు వరుసగా కోల్పోయినా ఆదిత్య జవ్వాజీ (48) ధాటిగా ఆడి జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు. చివర్లో ఆర్యన్ కారియప్ప (30 నాటౌట్) పోరాడినా లక్ష్యం చాలా దూరంగా ఉండటంతో రైజర్స్ 20 ఓవర్లలో 172/9కే పరిమితమైంది. కరీంనగర్ బౌలర్లలో నారాయణ తేజ 3 వికెట్లతో ప్రత్యర్థి బ్యాటింగ్ వెన్నెముక విరిచాడు. రాథ్లావత్ దినేష్ (2), శుభమ్ శర్మ (2), ఆశిష్ శ్రీవాస్తవ్ (1), బి. సతీష్ కుమార్ (1) తమ వంతు పాత్ర పోషించి జట్టుకు ఘన విజయాన్ని అందించారు. అద్భుత బ్యాటింగ్‌తో మ్యాచ్ గమనాన్ని మార్చిన రాహుల్ రాదేశ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story