Malkajgiri: మల్కాజిగిరి డిగ్రీ కళాశాలలో ఘనంగా 'హిందీ పక్షోత్సవాలు'!
Malkajgiri: మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా హిందీ పక్షోత్సవాలు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బండి రాజు, ఇఫ్లూ ప్రొఫెసర్ రేఖారాణి పాల్గొని బహుమతుల ప్రదానం.
Malkajgiri: మల్కాజిగిరి డిగ్రీ కళాశాలలో ఘనంగా 'హిందీ పక్షోత్సవాలు'!
Malkajgiri: హిందీ భాష ప్రాధాన్యాన్ని గుర్తించి, విద్యార్థులు భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బండి రాజు సూచించారు. కళాశాలలో హిందీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన హిందీ పక్షోత్సవాల కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాలు, భాషలు, సంస్కృతులకు చెందిన ప్రజలను అనుసంధానించడంలో హిందీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. విద్యార్థులు హిందీ నేర్చుకోవడంతో పాటు మాట్లాడటం, రాయడంపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు.
ముఖ్య అతిథిగా హాజరైన ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ హిందీ విభాగం పూర్వాధ్యక్షురాలు ప్రొఫెసర్ టి.జె. రేఖారాణి మాట్లాడుతూ హిందీ భాష, సాహిత్యం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు హిందీపై మక్కువ పెంచుకుని భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.
విశిష్ట అతిథి ఎస్‌బీఐ బ్యాంక్ మేనేజర్ చిల్లప్ప అనిరుధ్ మాట్లాడుతూ విద్యతో పాటు భాషా నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకోవచ్చన్నారు. హిందీ పరిజ్ఞానం వివిధ ప్రాంతాల ప్రజలతో సులభంగా సంభాషించేందుకు, ఉద్యోగ రంగంలోనూ ఉపయోగపడుతుందని తెలిపారు.
హిందీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా. జి.ఎన్. జగన్ మాట్లాడుతూ విద్యార్థుల్లో హిందీ భాషపై ఆసక్తిని పెంపొందించడమే హిందీ పక్షోత్సవాల ప్రధాన ఉద్దేశమన్నారు. ఇందులో భాగంగా చిత్రలేఖనం, వక్తృత్వం, వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు తెలిపారు.
పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను ప్రదర్శించారు. హిందీలో ప్రసంగించడంతో పాటు కవితా గానం చేసి ఆకట్టుకున్నారు. వివిధ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమం ముగింపులో ముఖ్య అతిథి ప్రొఫెసర్ టి.జె. రేఖారాణి, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బండి రాజు, అధ్యాపకులను మెమెంటోలు, శాలువాలతో సన్మానించారు.
కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. అడవి రాజు, అకడమిక్ కోఆర్డినేటర్ డా. గుణాకర్, డా. మల్లిక, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా. రాజేశ్ కుమార్, డా. హరిత, శైలజ, డా. అహల్య, ప్రొ. వెంకటరెడ్డి, డా. యాదగిరి, డా. ప్రదీప్, డా. లలిత, వనజ, డా. శోబన్‌బాబు, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.




