Medipally: విడాకులు అడిగిందని కక్ష.. భార్యపై హత్యాయత్నం!
Medipally: మేడిపల్లి పరిధిలోని పర్వతాపూర్‌లో దారుణం: విడాకులు కోరిందని భార్య మాధవిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన భర్త తేజ.. ఆస్పత్రిలో బాధితురాలికి చికిత్స, కేసు నమోదు.
Medipally: విడాకులు అడిగిందని కక్ష.. భార్యపై హత్యాయత్నం!
మేడిపల్లి: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై భర్త కత్తితో దాడి చేసిన ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పర్వతాపూర్ లక్ష్మీనగర్ కాలనీలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. పర్వతాపూర్‌కు చెందిన బద్దుల మాధవి (28)కి అదే ప్రాంతానికి చెందిన అడ్ల తేజ (33)తో పదేళ్ల క్రితం వివాహమైంది.
రెండేళ్లపాటు దంపతులు కలిసి జీవించిన అనంతరం వారి మధ్య విభేదాలు తలెత్తడంతో కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. వీరికి సంతానం కలగలేదు. ప్రస్తుతం మాధవి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సుమారు 8.30 గంటలకు మాధవి తన స్నేహితురాలి ఇంటి నుంచి తిరిగి వస్తుండగా పర్వతాపూర్‌లోని నరసింహస్వామి ఆలయం సమీపంలో తేజ ఆమెను అడ్డుకున్నాడు.
తన వెంట తెచ్చుకున్న కత్తితో మాధవి మెడ, భుజం, పొట్ట, తొడలపై దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావ గాయాలయ్యాయి. ఘటనను గమనించిన స్థానికులు అక్కడికి చేరుకోవడంతో తేజ అక్కడి నుంచి పరారయ్యాడు.
సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన మాధవిని చికిత్స నిమిత్తం మేడిపల్లిలోని శ్రీ సాయి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది. ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. ఘటనపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న తేజ కోసం గాలిస్తున్నారు.




