Hyderabad Biryani Price Hike: బిర్యానీ ప్రియులకు బిగ్ షాక్.. హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ధరలు!
Hyderabad Biryani Prices Hiked: హైదరాబాద్‌లో బిర్యానీ ప్రియులకు షాక్. పలు హోటళ్లు చికెన్ బిర్యానీ ధరలను రూ.30 నుంచి రూ.50 వరకు పెంచడంతో వినియోగదారులపై భారం పెరిగింది.
Hyderabad Biryani Price Hike: బిర్యానీ ప్రియులకు బిగ్ షాక్.. హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ధరలు!
Hyderabad Biryani Price Hike: బిర్యానీ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది హైదరాబాద్. నగరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఈ వంటకానికి స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు కూడా వీరాభిమానులే. అయితే ఇప్పుడు బిర్యానీ ప్రియులకు ధరల పెరుగుదల షాక్ ఇస్తోంది. హైదరాబాద్‌లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు బిర్యానీ ధరలను పెంచడంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది.
ముఖ్యంగా చికెన్ బిర్యానీ ధరలను రూ.30 నుంచి రూ.50 వరకు పెంచినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో గతంలో రూ.230గా ఉన్న చికెన్ బిర్యానీ ధర ప్రస్తుతం రూ.280కి చేరింది. ఇదే తరహాలో నగరంలోని పలు ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు కూడా కొత్త ధరలను అమల్లోకి తీసుకొచ్చాయి. దీంతో తరచూ హోటళ్లలో బిర్యానీ తినే వారికి ఖర్చులు పెరగనున్నాయి.
గ్యాస్, చికెన్, బియ్యం ధరల పెరుగుదలే కారణం!
బిర్యానీ ధరల పెంపునకు వంట ఖర్చులు పెరగడమే ప్రధాన కారణమని హోటల్ నిర్వాహకులు, రెస్టారెంట్ యజమానులు చెబుతున్నారు. వంట గ్యాస్‌తో పాటు వంట నూనె, బియ్యం, చికెన్ వంటి ముడి సరుకుల ధరలు పెరిగాయని వివరిస్తున్నారు. వీటికి తోడు సిబ్బంది వేతనాలు, విద్యుత్ బిల్లులు, హోటళ్ల నిర్వహణ ఖర్చులు కూడా అధికమయ్యాయని పేర్కొంటున్నారు.
పెరిగిన ఖర్చుల కారణంగా పాత ధరలతో బిర్యానీ విక్రయించడం కష్టంగా మారిందని, అందుకే ధరలను సవరించాల్సి వస్తోందని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు హోటళ్లలో ఆహార పదార్థాల ధరలు పెరగడం మరింత భారంగా మారుతోంది.
మరోవైపు హైదరాబాద్ బిర్యానీకి దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ధరలు పెరిగినప్పటికీ బిర్యానీకి ఉన్న డిమాండ్ ఏ మేరకు కొనసాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా బిర్యానీ ప్రియుల జేబులకు మాత్రం ఈ ధరల పెంపు చిల్లులు పెట్టనుంది.




